Thursday, April 25, 2024

Hyderabad | బడా హోటళ్లు, రోడ్​ సైడ్​ బండ్లు, అంతటా ఫుడ్​ కల్తీ..  పట్టించుకోని జీహెచ్​ఎంసీ

హైదరాబాద్​ మహానగరంలో ఫుడ్​ కల్తీ విచ్చలవిడిగా జరుగుతోంది. చిన్న చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన విక్రయించే తినుబండారాలు, పానీయాల్లోనే కాకుండా నగరంలోని కొన్ని ప్రముఖ రెస్టారెంట్లలో కూడా ఫుడ్​ కల్తీ జరుగుతున్నట్లు సమాచారం. జంటనగరాల్లో కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలామంది అంటున్నారు. మసాలా దినుసులు, నూనెల కల్తీ వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కల్తీ వ్యాపారాలు పెరుగుతున్నాయి. అయితే.. సిటీలోని బడా హోటళ్ల నుంచి రోడ్​ సైడ్​ బండ్లపై నిర్వహించే చిన్న చిన్న సెంటర్లదాకా పెద్ద ఎత్తున కల్తీ దినుసుల వినియోగం జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, కొన్నిచోట్ల ఈ వ్యాపారాలపై చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఎక్కువగా ఈ పనుల్లో పాల్గొంటూ హోల్‌సేల్ వ్యాపారులను టార్గెట్​ చేసుకుని వారి ద్వారా నగరంలోని చిన్న చిన్న దుకాణాలకు మిక్స్ డ్ మసాలాలు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది.

కల్తీ నూనె, జీలకర్ర, ఎర్ర కారం, ఇతర వస్తువుల వ్యాపారులు నగరంలోని హోల్‌సేల్ మార్కెట్‌ల సమీపంలో తమ గోదాములను ఏర్పాటు చేసుకుంటున్నారు చాలామంది. ఇట్లా ఈ వస్తువుల ఉత్పత్తి జనావాసాలు ఎక్కువగా ఉన్న చోట్ల కానీ, నగర శివారులోని నివాస ప్రాంతాలలోనే ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది.  ఏది ఏమైనప్పటికీ.. జంట నగరాల్లో కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలకు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. దీనిపై జీహెచ్​ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే కల్తీ ఆహారం తిని ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని చాలామంది కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement