Friday, April 19, 2024

గంటా శ్రీనివాసరావు రాజకీయ సన్యాసం?

రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏమైనా జరగొచ్చు. కొందరు రాజకీయ నేతలు ఎప్పుడు పార్టీలు మారతారో కూడా తెలియదు. అయితే కొందరు మాత్రం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారు. విశాఖ జిల్లాకు చెందిన కీలక రాజకీయ నేత, కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు ఉన్న నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఇప్పుడు అనూహ్య నిర్ణయమే తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారని టాక్ నడుస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కారణంగా కార్మికులకు మద్దతు ఇచ్చేందుకు విశాఖ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని పిలుపునిచ్చిన ఆయన.. తొలుత ఆయనే రాజీనామా చేశారు. విశాఖలో మున్సిపల్ ఎన్నికలు జరగడానికి ముందే ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన అనుచరుడు, కుడిభుజంలా ఉండే కాశీ విశ్వనాథం వైసీపీ కండువా కప్పేసుకున్నారు. దీంతో త్వరలోనే గంటా కూడా వైసీసీలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ జరిగింది వేరు.

గంటా వైసీపీలో చేరడానికి ముఖ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ మోకాలు అడ్డుపెడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ గంటా వైసీపీలోకి వస్తే తమ ఆధిపత్యానికి గండి పడుతుందని వాళ్లు భావిస్తున్నట్లు రాజకీయ పండితులు చెప్తున్నారు. అటు టీడీపీలోనే కొనసాగితే తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని గంటా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలో ఉండలేక, వైసీపీలోకి వెళ్లలేక గంటా అయోమయంలో పడిపోయారని విశాఖకు చెందిన పలువురు నేతలు చెప్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో గంటా గట్టి నిర్ణయమే తీసుకున్నారని, ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నారని, కొన్నిరోజుల్లో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గంటా రాజకీయ ప్రస్థానం ఇదీ..
1999లో గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement