Friday, March 29, 2024

నాటు కోడికి ఫుల్‌ డిమాండ్‌.. రోజు రోజుకూ పెరుగుతున్న గిరాకీ..

చిన్నగూడూరు, (ప్రభ న్యూస్): ప్రకృతి వైపర్యితాలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతకు పెరటి కోళ్ల పెంపకం లాభాలు తెచ్చిపెడుతోంది. పంటల సాగుతో పాటు అనుబంధ రంగాలైన కోళ్ల పెంపకంపై కూడా రైతులు క్రమేనా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో నాటు కోళ్లకు, వాటి గుడ్లకు మంచి గిరాకీ ఉండటంతో వీటి పెంప‌కానికి చాలామంది ముందుకొస్తున్నారు.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ముక్కలేనిదే ముద్ద దిగదు. సండే వచ్చిందంటే చాలు మెనూలో మాంసాహారం ఉండాల్సిందే! అందుకే వారాంతాల్లో రెస్టారెంట్లు కిటకిటలాడుతాయి. చికెన్, మటన్‌ సెంటర్లు కళకళలాడుతాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు కొత్తదారి పడుతున్నారు. రుచి, ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ పల్లె బాట పడుతున్నారు. నాటు కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచిని ఆస్వాదిస్తున్నారు.

పౌల్ట్రీ విప్లవంతో వీధికో చికెన్‌ సెంటర్‌. పల్లెకో (మినీ) పౌల్ట్రీ పరిశ్రమ. ప్రజల నుంచి డిమాండ్‌ ఉండడాన్ని కొందరు క్యాష్‌ చేసుకుంటున్నారు. బాయిలర్‌ కోళ్లు వేగంగా పెరగడానికి ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్‌ ఇస్తున్నారు. మూడు నెలలు పెరగాల్సిన కోడి కేవలం నలభై రోజుల్లోనే 3 కిలోల బరువు వరకు పెరుగుతోంది. ప్రజల డిమాండ్‌కు అనుకూలంగా రసాయనాలను వాడి కోళ్లను సరఫరా చేస్తున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలూ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌష్టిక విలువలున్న నాటు కోళ్లవైపు మాంసాహార ప్రియుల చూపు మళ్లింది.

రసాయనాలతో పని లేకుండా నాటుకోళ్లు పెరుగుతున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే తౌడు, మ‌క్కజొన్నలు, సజ్జలు, బియ్యం, నూకలు, రాగులు వంటి ధాన్యాలు తిని పెరుగుతున్నాయి. దీంతో వీటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. మంచి రుచి కూడా ఉండటంతో నాటుకోడి చికెన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. గ్రామాల్లో సహజంగా కనిపించే కోళ్లతో పాటు దేశవాలీ కోళ్లలోనూ గిరి రాజు, వనరాజు వంటి అనేక జాతులున్నాయి. నగరం చుట్టుపక్కల గ్రామాల్లో వీటిని పెంచి అనేకమంది జీవనోపాధి కూడా పొందుతున్నారు.

నాటుకోడికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ‘నాటుకోడి చికెన్‌ లభించును’ అని కొన్ని రెస్టారెంట్లు వినియోగదారుల్ని ఆకర్షిస్తూ బోర్డులు పెడుతున్నాయి. యువత పార్టీలు చేసుకునే సమయంలో నాటుకోడికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది. మహబూబాబాద్ నగరవాసులకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. బాయిలర్‌ కోళ్లు తినడానికి చాలామంది ఇష్టపడట్లేదు. ఈ క్రమంలో నాటు కోళ్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఇవి పల్లెల్లో ఎక్కువగా లభిస్తున్నాయి. దీంతో ప్రత్యేకంగా వీటికోసం వారాంతాల్లో పల్లెబాట పడుతున్నారు. నాటుకోడి కిలో ధర రూ.400 పలుకుతోంది. అయినప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది.

- Advertisement -

ఇతర కోళ్ల కంటే నాటుకోడి మాంసం రుచిగా ఉంటుంది. ఇంటిళ్లిపాది నాటుకోడినే ఇష్టపడుతున్నాం. ధర కాస్త ఎక్కువైనా కూడా నాటుకోడి మాంసమే తింటున్నాం. ఆదివారం వస్తే దేశవాళీ కోళ్ల పెంపకం దారుల వద్ద నాటు కోడిని కొని తెచ్చుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా పల్లెబాట పడుతున్నాం. ఆరోగ్యం, రుచి అన్నింటా సహజంగా పెరిగిన నాటుకోళ్లే నయం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement