Saturday, April 20, 2024

‘ప‌బ్లిక్’ స‌ర్వీస్ లో ‘నిర్ల‌క్ష్యం’ – ‘క‌మీష‌న్’ లే ‘సర్వస్వం’

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఉద్యోగ నియామకాలను చేపట్టే బాధ్యతగల రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో పారదర్శకత కొరవడింది. రాజ్యాంగ ప్రతిపత్తి ఉన్న సంస్థలోనూ జరుగుతున్న అవినీతి, అక్రమాలు, లోటుపాట్లు చూస్తుంటే నమ్మకమన్న పదానికి అర్థం లేకుండా పోతోంది. తల్లిదండ్రుల రెక్కల కష్టంతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలన్న తపన, తాపత్రయంతో పరీక్షలు రాస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు సమాధానం కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలోనే కాదు.. గతంలోకి తొంగి చూస్తే అనేక సందర్భాల్లో వైఫల్యాలకు కేంద్ర బిందువుగా టీఎస్పీఎస్సీ నిందలు ఎదుర్కొంది. శాఖాపరమైన నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉంటుందన్న క్రమంలోనే కమిషన్‌ ద్వారా జరిగే నియామకాలకు ప్రాధాన్యత పెరిగింది. కానీ, అంతర్గతంగా జరుగుతున్న లోపాలు ఒక్కొక్కటీ బయటపడ్డకొద్దీ ఈ సంస్థపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వెలుగులోకి వస్తున్న పరిణామాలు చూస్తుంటే..
గతంలో స్వల్ప తేడాతో ఉద్యోగం రాక భవిష్యత్తు కోల్పోయిన లక్షలాది మంది అభ్యర్థుల గుండె తరుక్కుపోతోంది. ఉద్యోగ నియామకాల్లో ఎంతపెద్ద సిఫారసులకైనా ఆస్కారం లేకుండా వందశాతం పారదర్శకత ఉండాలన్న లక్ష్యంతో, రాజ్యాంగబద్దమైన నిబంధనలతో ఏర్పాటైన ఈ సంస్థ క్రమేపీ నియంత్రిత పాలనలోకి వెళ్ళిపోతోంది. టీఎస్పీఎస్సీ పరిపాలనలో అత్యున్నస్థాయి పదవుల్లో నియామకమవుతున్న వ్యక్తులు కూడా అందుకు ఒక కారణంగా విద్యారంగ నిపుణులు, మేధావులు చెబుతున్నారు.
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెనక పరిపాలన, విధానపరమైన వైఫల్యాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఉన్నతస్థాయి పర్యవేక్షణ జరుగుతుందని, అనంతరం కమిషన్‌ పాలన షరా మామూలేనన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ సంస్థ అంతర్గత వ్యవహారాలను పరిశీలిస్తే చైర్మన్‌ మొదలుకుని సభ్యుల వరకూ ఏ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం లేదన్నది స్పష్టమవుతోంది. రాజ్యాంగాధిపతి హోదాలో ఉన్న గవర్నర్‌కు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రతియేటా క్రమం తప్పకుండా వార్షిక నివేదికలను అందజేయాల్సి ఉంది. ఆ నివేదికలపై గవర్నర్‌ వార్షికంగా రెండు పర్యాయాలైనా సమీక్ష చేయవలసి ఉంటుంది. కానీ అవేవీ జరగడం లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మార్గదర్శకాలను అనుసరిస్తూ సంస్థాగత పాలన, కొలువుల నియామకాలు అత్యంత గోప్యంగా, పారదర్శకంగా జరగాల్సిన టీఎస్సీఎస్సీలో అక్రమాలే ఎక్కువన్న వాదనకు తాజా ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే ఉన్నతస్థాయి ఉద్యోగాలు నియమించే కమిషన్‌ కార్యకలాపాల్లో అర్హతలేని వ్యక్తులు, తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగుల ప్రమేయం ఏ మేరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

కొలువుల సంస్థలోనే ఖాళీలు
వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగంలోని సంస్థల్లో ఉద్యోగాలివ్వాల్సిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో అన్నీ ఖాళీ పోస్టులుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పరిమిత సంఖ్యలో సిబ్బంది, బలహీనమైన సాంకేతిక వ్యవస్థ అక్రమార్కులకు అవకాశంగా మారుతోంది. సాంకేతికతలో లోపాలు, రక్షణ లేమిని ఆసరాగా చేసుకుని కమిషన్‌లో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది లోపాయకారి ఒప్పందాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసినట్లు- తాజా ఘటనకు సంబంధించిన దర్యాప్తులో వెల్లడైంది. అదనపు సిబ్బంది, పటిష్ఠమైన ఐటీ- కేంద్రంతో పాటు- ఇతర లోపాలపై ముందుగానే మేల్కొని ఉంటే ఈ పరిస్థితికి దారితీసేది కాదని విద్యారంగ, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దర్యాప్తు బృందానికి నివ్వెరపోయే నిజాలు
ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు బృందానికి నివ్వెరపోయే నిజాలు దర్శనమిచ్చాయి. లక్షలాది మంది జీవితాలతో ముడిపెట్టుకుని ఉన్న నియామకాల ప్రక్రియలో అడపా దడపా డబ్బులకు లొంగే సిబ్బంది ఉండడం, వారిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీ-ఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ. యూపీఎస్సీ తరహాలోనే ఇక్కడి కార్యకలాపాలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌ కార్యకలాపాలు అత్యంత గోప్యంగా ఉండాలి. కంప్యూటర్‌ ఆధారిత పరిపాలన కావడంతో పటిష్ఠమైన నెట్‌వర్క్‌ అవసరం. కానీ టీ-ఎస్పీఎస్సీలో నెట్‌వర్క్‌ అత్యంత బలహీనంగా ఉందని వెల్లడైంది. ఐటీ- వ్యవస్థ కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కూడా అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలకు కేటాయింపులు తగ్గించడంతో.. రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ ఆరుగురి స్థానంలో నలుగురితోనే పనిచేయిస్తున్న వైనం దర్యాప్తు అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

- Advertisement -

కాన్ఫిడెన్షియల్‌ అన్న పదానికి అక్కడ అర్థమే తెలియదు
హోటళ్ళు, టీ కొట్టుల్లోనూ సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తున్న ఈ రోజుల్లో కూడా అత్యంత పటిష్టమైన వ్యవస్థను కలిగి ఉండాల్సిన పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో నిత్యం బయట వ్యక్తులు వచ్చిపోతుండడం పట్ల కూడా పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం ఈ సంస్థ వైఫల్యాన్ని మరింతగా ఎత్తిచూపుతోంది. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ నిర్వహిస్తున్న చోట సీసీటీ-వీ కెమెరాలు, బయోమెట్రిక్‌ నమోదు చేసే వ్యవస్థ లేకపోవడమూ నిందితులకు వరంగా మారింది. బయోమెట్రిక్‌ వ్యవస్థ ఉంటే పాస్‌వర్డ్‌ దొంగిలించేందుకు అవకాశాలు ఉండేవి కాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటిది లక్షల మంది నిరుద్యోగ యువత భవితవ్యం ఆధారపడి ఉన్న కమిషన్‌లో మాత్రం ఇలాంటి ఏర్పాట్లు- లేకపోవడం నిర్లక్షానికి నిదర్శనం.

అక్రమాలకు ఇవీ కారణాలు..
పరీక్షల నిర్వహణలో లోటు-పాట్లపై నాలుగేళ్ల క్రితమే పబ్లీక్‌ సర్వీస్‌ కమీషన్‌ నివేదిక ఇచ్చినా ఆశించిన స్పందన లేదన్నది అధికారుల వాదన. ఉద్యోగుల కొరతతో ప్రస్తుతం ఉన్నవారిపై తీవ్ర పనిభారం పడుతోందంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లోని సర్వీస్‌ కమిషన్‌లలో కనీసం 1,600 మందికి తగ్గకుండా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదే తరహాలో టీ-ఎస్పీఎస్సీకి సిబ్బందిని కేటాయించాల్సిన అవసరం ఉంది. కనీసం 341 మంది ఉద్యోగులు అవసరమని నివేదించినా సమకూర్చలేదు. అయితే, టీఎస్పీఎస్సీకి 166 ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. అందులో ప్రస్తుతం 106 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో నాలుగో తరగతి ఉద్యోగులతో కలిపి 83 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, మిగతా సిబ్బంది ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియామకమై పనిచేస్తున్నారు. వీరంతా మానవ వనరులను సమకూర్చే ఒక ఏజెన్సీ ద్వారా వచ్చిన వ్యక్తులు కావడంతొనే అంతర్గత అక్రమాల వ్యవహారం కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement