Monday, January 24, 2022

Big Story: అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. యూపీలో గోడదూకుడు య‌వ్వారాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉత్తర్‌ప్రదేశ్ సహా మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడమే ఆలస్యం నేతల గోడదూకుడు వ్యవహారాలు మరింత ఊపందుకున్నాయి. ఎన్నికల వేళ ఆశించిన టికెట్లు దక్కకపోవడం, లేదా పార్టీలో కొత్తగా చేరినవారితో పొసగకపోవడం వంటి కారణాలతో నేతలు పార్టీలు మారడం కొత్తేమీ కాదు. అయితే యూపీలో ఏకంగా ప్రభుత్వంలో కేబినెట్ మంత్రులుగా పనిచేసినవారే పార్టీలు మారి రాజకీయ కలకలం సృష్టిస్తున్నారు. రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, మరో 4గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి 24 గంటలు గడవక ముందే మరో మంత్రి ధారాసింగ్ చౌహాన్ బుధవారం రాజీనామా చేశారు.

మంత్రిపదవికి, పార్టీకి ఒకేసారి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య, తన బాటలో మరికొందరు నడుస్తారంటూ ప్రకటించారు. అన్నట్టుగానే, అటవీ, పర్యావరణ, జంతు, ఉద్యానవన శాఖల మంత్రిగా ఉన్న ధారాసింగ్ చౌహాన్ తన మంత్రిపదవికి రాజీనామా చేయడం కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్వామి ప్రసాద్ మౌర్య రాసిన రాజీనామా లేఖ, ధారాసింగ్ రాజీనామా లేఖల్లో లెటర్ హెడ్లు, పైన కింద పేర్లు తప్ప మిగతా అంతా ఒకేలా ఉండడం చూస్తుంటే, ముందుగానే ఈ నిర్ణయాలు జరిగాయని తెలుస్తోంది. ధారాసింగ్ కూడా స్వామి బాటలో సమాజ్‌వాదీ పార్టీలో చేరతారని అర్థమవుతోంది.

యూపీలో రాజకీయం కేవలం బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి గోడ దూకడంతోనే ఆగలేదు. బీజేపీ గత కొన్నాళ్లుగా ఇతర పార్టీల్లో బలమైన నేతలకు గాలం వేస్తూ వరుసగా చేర్చుకుంటూ వస్తోంది. మంత్రి ధారాసింగ్ రాజీనామా కంటే ముందు సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కొందరు కీలక నేతలకు బీజేపీ కండువా కప్పింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సిర్సాగంజ్ ఎమ్మెల్యే హరిఓం యాదవ్, సహరాన్‌పూర్‌లోని బెహత్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న నరేష్ సైనీలు బుధవారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. వారితో పాటు ఈ మధ్య బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ని వీడి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ధరంపాల్ సింగ్ కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

ఎస్పీ కంచుకోటలో బీజేపి

ఫిరోజాబాద్‌లో ఎస్పీకి కంచుకోటగా భావించే సిర్సాగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. చాలా రోజుల కసరత్తు తర్వాత ఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే హరిఓం యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. 2012లో ఏర్పాటైన సిర్సాగంజ్ అసెంబ్లీ స్థానం ఎస్పీ కంచుకోటగా మారింది. యాదవ్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2012, 2017లో ఎస్పీ తరఫున హరిఓం యాదవ్‌ వరుసగా విజయాలు సాధించారు. 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా పంచాయతీలో అవిశ్వాస తీర్మానంపై ఆయన ఎస్పీ నాయకత్వంతో విబేధించారు.

హరిఓం, ఆయన కుమారుడు జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు విజయ్‌ ప్రతాప్‌ను ఎస్పీ నుంచి బహిష్కరించారు. అప్పుడు హరిఓం యాదవ్ బహిరంగంగా శివపాల్ యాదవ్‌తో కలిసి ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్‌పై ఎదురుదాడికి దిగారు. లోక్‌సభ ఎన్నికల్లో రామ్‌గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఓటమి తర్వాత వైరం మరింత ముదిరింది.

ఇదిలా ఉంటే, బీజేపీని ఢీకొట్టేందుకు వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో అనేక పార్టీలను కలుపుకుని వెళ్తున్న అఖిలేశ్ యాదవ్, తన బాబాయి శివపాల్ సింగ్‌తో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎస్పీ బహిష్కృత నేత హరిఓం యాదవ్ మళ్లీ తిరిగి సొంత గూటికి చేరతారని అందరూ భావించారు. అయితే ప్రొఫెసర్ రాంగోపాల్ యాదవ్ మాత్రం హరిఓంను తిరిగి చేర్చుకోడానికి అసలేమాత్రం సుముఖంగా లేరు. పోనీ శివపాల్‌తో కలిసి ముందుకు వెళ్దామన్నా సరే.. ఆయన్నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హరిఓం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్‌ శిబిరంలో గుబులు

కొన్నాళ్ల క్రితం రాయ్‌బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ బీజేపీలో చేరారు. తాజాగా ఇద్దరు కీలక నేతలు ఇమ్రాన్‌ మసూద్‌, మసూద్‌ అక్తర్‌లు కాంగ్రెస్‌ను వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ మధ్యనే ఉందని.. ఈ పరిస్థితుల్లో సమాజ్‌వాదీతో పొత్తుపెట్టుకుని కూటమిలో చేరాలని కొన్నాళ్లుగా నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం అందుకు సుముఖంగా లేకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు.

బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైనీ బుధవారం బీజేపీలో చేరడంతో స్వల్ప వ్యవధిలో కీలక నేతలను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. సహరాన్‌పూర్‌లో కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, రెండు రోజుల వ్యవధిలోనే ఒకరు ఎస్పీలో, మరొకరు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News