Saturday, April 20, 2024

Breaking: లక్నోలో అగ్నిప్రమాదం.. రిటైర్డ్​ ఐపీఎస్​ ఆఫీసర్​ మృతి, భార్య, కుమారుడి పరిస్థితి విషమం

ఉత్తర ప్రదేశ్​ రాష్ట్రం లక్నో సిటీలోని ఇందిరా నగర్‌లో ఘోరం జరిగింది. సొంత ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రిటైర్డ్ IPS అధికారి ఒకరు ఇవ్వాల (ఆదివారం) ప్రాణాలు కోల్పోయారు. ఈ అగ్ని ప్రమాదంలో అతని భార్య, కొడుకు పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంట్లో మంటలు రావడంతో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి దినేష్‌ చంద్ర పాండే తన భార్య అరుణ, కుమారుడు శశాంక్‌తో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వారు అనుకోకుండా మంటల్లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.

ఈ సమాచారం అందుకున్న ఇందిరానగర్ అగ్నిమాపక సిబ్బంది మూడు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖతో పాటు ఇందిరానగర్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికి పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఆక్సిజన్ మాస్క్ లు ధరించి, 8 నుండి 10 మంది వ్యక్తుల బృందం ఇంటి మొదటి అంతస్తుకు చేరుకుంది. అక్కడ అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న వ్యక్తులను పిలిచారు. వారికి ఎలాంటి స్పందన రాకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

సెర్చ్ ఆపరేషన్ సమయంలో అగ్నిమాపక సిబ్బంది దినేష్ చంద్ర పాండే, అతని కుటుంబం ఒక గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంతలో, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి మరణించినట్లు డాక్టర్ల ప్రకటించారు, అతని భార్య, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మృతి చెందడంతో అగ్నిప్రమాదానికి కారణమేమిటనే విషయమై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement