Thursday, April 25, 2024

ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతికి శ్రీకారం.. ఈనెల 18న సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 18(బుధవారం)న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పల్లె, పట్టణ ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, అటవీ శాఖ రాష్ట్రస్థాయి అధికారులు, మున్సిపల్‌ కార్పోరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెలు, పట్టణాల్లో ప్రభుత్వం విస్తృతంగా అభివృద్ధి పనులను చేపట్టనుంది. కార్యాలయాలు, పార్కుల్లో పచ్చదనం, పరిశుభ్రత, రహదారులు, కాలువలు, విద్యుత్‌ దీపాల మరమ్మత్తు వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల అభివృద్ధి, కొత్తగా విద్యుత్‌ స్థంభాల ఏర్పాటు వంటి చర్యలను చేపట్టనున్నారు.

గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా ఏక కాలంలో పల్లెలు, పట్టణాల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రామాలను నిర్వహిస్తోంది. పది రోజులపాటు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజలందరినీ భాగస్వమ్యం చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన కొనసాగించనున్నారు. ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం పెంపు లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యమ్రం ద్వారా పనులను చేపట్టేందుకు గ్రామాలకు నెలకు రూ. 308కోట్లు, పట్టణాలకు రూ. 148కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. 2020నుంచి ఇప్పటివరకు గ్రామాలకు రూ. 4వేల కోట్లు, పట్టణాలకు రూ. 2500కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
పల్లె, పట్టణ ప్రగతిలో అసపూర్తి పనులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు నిధులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. ఉపాధిహామీ పథకం బిల్లులు, వర్షాకాలం సీజన్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించి, సర్పంచ్‌లు మొదలుకొని సీఎం కేసీఆర్‌ వరకు అందరూ ఇందులో భాగస్వామ్యం కానున్నారు. ప్రతీ పంచాయతీకి ఒక నోడల్‌ అధికారిని నియమించి పనులను పర్యవేక్షణ చేయనున్నారు.

శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, బావుల పూడ్చివేత, చెత్త తొలగింపు వంటివి చేపడ్తారు. అయితే పనుల ప్రగతిపై ఈ దఫా సీఎం కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉంది. పంచాయతీ కార్యదర్శినుంచి సీఎస్‌ వరకు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనేలా సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయనున్నారు. రకరకాల కమిటీలను ఏర్పాటు చేసి పనులను సమీక్షిస్తారు. ఈ కమిటీలు మూడు నెలలకోసారి సమావేశమై పనుల వివరాలను పర్యవేక్షనుంది. పంచాయతీరాజ్‌ శాఖ ఈ కార్యక్రమాలకు ప్రత్యేక ఎజెండా ప్రకటించనుంది. గ్రామ సభల్లో సీఎం కేసీఆర్‌ సందేశం వినిపించనున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కల్గకుండా చర్యలు తీ’సుకోవడంతోపాటు, పిరిశుద్ధ్య నిర్వహణ, మొక్కలు నాటడం, గతంలో నాటిన చెట్లను పరిశీలించడం, కరెంటు వైర్ల సరిజేత, 100శాతం విద్యుత్‌ వీధి దీపాలు, నర్సరీల ఏర్పాటు, తాగునీటి సరఫరా వంటి చర్యలను పరిశీలిస్తారు. సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక కార్యాచరణ తీసుకొంటారు.

అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం విప్లవాత్మకంగా క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులకు ఈ పల్లె, పట్టణ ప్రగతితో శ్రీకారం చుడుతోంది. తెలంగాణ ప్రగతికి ఈ కార్యక్రమం బాటలు వేయనుంది. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగించేలా ప్రభుత్వం కార్యచరణ నిర్ధేశించుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఊరు-మన బడి కార్యక్రమంతో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనుంది. రూ. 7280కోట్లతో నిర్వహిస్తున్న మన ఊరు- మన బడి కార్యక్రమ ప్రాధాన్యతలను వివరించి పాఠశాలను ఆధునీకరించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement