Friday, April 19, 2024

Big Story: దేశంలో ఐదో స్థానానికి.. తెలంగాణ‌ రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త రికార్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ శాఖలో రాబడిని, ఆర్ధిక ఏడాదిని ఆగష్టునుంచి ఆగష్టుకు లెక్కించగా రూ. 15వేల కోట్ల రాబడి మార్కుతో చరిత్ర లిఖించింది. గతేడాది ఆగష్టు 1నుంచి ఈ ఏడాది ఆగష్టు 1కి తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి ఆదాయం ఇతర రాష్ట్రాలను వెనుకకి నెట్టి దేశంలో ఐదో స్థానంలో నిల్చింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 1నుంచి నేటి వరకు 4,41,254 డాక్యుమెంట్లు రిజిస్టర్‌కాగా, రూ. 4156కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. ఇందులో ఈసీలు 1558163 అందించిన రిజిస్ట్రేషన్ల శాఖ, 23920 స్లాట్‌ బుకింగ్‌ రిజిస్ట్రేషన్‌ సేవలను అందించింది. విప్లవాత్మకంగా 40,478 వివాహ రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతంలో ప్రజలకు మ్యుటేషన్లకు ఉన్న ఇబ్బందులను నివారించేందుకు ఈ శాఖ తీసుకొచ్చిన ఆటో మ్యుటేషన్‌ విధానం సత్ఫలితాలనిస్తోంది. ఈ ఏడాది 5,46,632 ఆటో మ్యుటేషన్లు పూర్తి చేశారు. ఈ ఏడాది ఆదాయంతో తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లను అధిగమించింది.

గతేడాది మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఒక ఏడాది ఆదాయం రెండు నెలల్లోనే సాధించి తెలంగాణ రాష్ట్ర స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2020-21 మార్చి 31తో ముగిసిన ఏడాదిలో రికార్డు స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడూ నమోదుకాని రీతిలో రూ. 1520కోట్ల ఆదాయం వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ఆదాయం రూపంలో సమకూరింది. గడచిన ఆర్ధిక ఏడాది మొత్తం రాబడి గరిష్టంగా రూ. 12,350కోట్లకుపైగా ఆర్జించింది. 2019-20లో రిజిస్ట్రేషన్ల రాబడి ఆదాయం రూ. 5260కోట్లుకాగా, 2020-21లో రెండింతలను అధిగమించడం విశేషం. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రూపంలో రూ. 2500కోట్ల పైచిలుకు ఆదాయం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఏడాది మొత్తంలో 18లక్షలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి.

గుజరాత్‌లో లేని ధరలు తెలంగాణ భూములు ఉండటంతోపాటు, వ్యవసాయానికి, వ్యవసాయేతర అవసరాలకు తెలంగాణ భూములకు అద్భుత డిమాండ్‌ వస్తున్నది. ప్రాజెక్టుల పూర్తితో వ్యవసాయ స్థిరీకరణ పెరగ్గా, పారిశ్రామిక, మోస్ట్‌ లివబుల్‌ స్టేట్‌గా తెలంగాణకున్న ఖ్యాతి దేశమంతటినుంచి పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారింది. సీఎం కేసీఆర్‌ దార్శనికత, ముందుచూపు వాస్తవంలోకి వచ్చింది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి, అద్భుతమైన పాలసీలు, ఏమరుపాటులేని శాంతిభద్రతలు కలగలిసిన తెలంగాణ పునర్‌నిర్మాణం దిశగా దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అద్భుత రికార్డును సొంతం చేసుకున్నది.

ఏటేటా రాబడులు ఇలా…
రాష్ట్ర ఆవిర్భావ ఏడాది(2014-15)లో రూ. 2500కోట్ల వార్షిక రాబడిలో ఉన్న రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2021-22 మార్చి 31నాటికి సరికొత్త చరిత్రను సృష్టించి రూ. 12,350.87కోట్లకు చేరుకుంది. గతేడాది (2020-21)లో 12 నెలల ఆదాయం రూ. 5260.20కోట్లుకాగా, అంతక్రితపు ఏడాది 2019-20లో రూ. 7061కోట్లను సాధించింది. 2018-19లో రూ. 6612కోట్ల రాబడిని ఆర్జించింది. 2020-21లో కరోనా తీవ్రత నేపథ్యంలో భారీగా రాబడి తగ్గినప్పటికీ, 2021-22లో రెండు దశల్లో పెంచిన మార్కెట్‌ విలువలు, ఒకసారి పెంచిన రిజిస్ట్రేషన్‌ రుసుములతో రాష్ట్ర రాబడి ఇంతింతై వటుడింతై అనట్లుగా వర్ధిళ్లుతున్నది.

రియాల్టితోపాటు, వ్యవసాయ రంగానికీ మంచి రోజులు…
కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో రాష్ట్రమంతటా రియల్‌ బూమ్‌ వచ్చింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ధీటుగా అన్ని జిల్లాల్లో భూములకు మంచి ధర పలుకుతోంది. క్రయవిక్రయాల జోరు పెరగడం, మార్కెట్‌ ధరకంటే వాస్తవ ధరలకు ప్రజలు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతో భారీగా రాబడి పెరిగింది.

- Advertisement -

రియల్‌ ఊపు…
తెలంగాణలో రియల్‌ వ్యాపార నిర్వహణకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి పెట్టుబడులు తరలి వస్తున్నాయని ఆర్ధిక శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లోనైతే క్రయవిక్రయాలకు అనూహ్య స్పందన వస్తోంది. అదే విధంగా యాదగిరిగుట్ట, వరంగల్‌ జాతీయ రహదారి పెట్టుబడి దారులకు స్వర్గధామంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement