Thursday, March 28, 2024

ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లోనే సంతాన సాఫల్యతా చికిత్స: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సంతాన లేమితో బాధపడుతున్న పేద, సామాన్య దంపతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంతానం కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడుతూ ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక పేద దంపతులకు ఉండదని భరోసా ఇస్తోంది. త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. మొదటగా ఒక్కోటి రూ.2.5కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లోని గాంధీ, పేట్ల బురుజు, వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. సంతాన లేమితో బాధపడుతున్న పేద దంపతులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఫెర్టిలి టీ చికిత్సను అందించనుంది.

దోచుకుంటున్న ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్లు..

ప్రస్తుతం సరైన ప్రమాణాలు పాటించకుండానే ఫెర్టిలిటీ వైద్యం అందిస్తూ పలు ఫెర్టిలి టీ ఆసుపత్రులు ఇష్టా రాజ్యంగా పనిచేస్తున్నాయి. సంతానం కోసం ఈ ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తూ పలువురు పేద, సామాన్య దంపతులు లక్షలకు లక్షలు పొగొట్టుకుంటున్నారు. అయినప్పటికీ వారికి సంతాన భాగ్యం కలగడం లేదు. దీంతో అటు ఆర్థికంగా, ఇటు సంతానం కలగటం లేదని మానసికంగా ఆ దంపతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్ల ఏర్పాటు నిర్ణయంలో భాగంగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో రెండున్నర కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఫెర్టిలిటీ ఓపీ నడుస్తుండగా… రోజుకు దాదాపు 40 మంది దంపతులు వైద్యం తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అతి త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్లకు ధీటుగా గాంధీలోనూ సంతాన సాఫల్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

మారిన జీవనశైలితోనే సంతానలేమి సమస్యలు..

మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పని ఒత్తడి కారణంగా యువతీ యువకుల్లో సంతానలేమీ సమస్య అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా పెళ్లైన ప్రతి వంద జంటల్లో 10 జంటలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ సర్వేలో తేలింది. ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్లలో వైద్యం చేయించుకున్నా సంతానం కలగకపోవడంతో కొంత మంది బెంగళూరు, ముంబై నగరాలకు కూడా చికిత్స కోసం వెళుతున్న సందర్బాలు ఉన్నాయి. సాధారణంగా సంతానలేమి సమస్యలు ఆడవారిలో… ఆలస్యంగా వివాహం కావడం, నెలసరి సక్రమంగా జరగకపోవడం, అండం పెరుగుదల, విడుదల సక్రమంగా లేకపోవడం, అండం ప్రయాణించే మార్గం మూసుకుపోవడం, అండాశయంలో నీటి బుడగలు (పీసీవోడీ), గర్భాశయ గోడలు పిండం ఎదుగుదలకు అనువుగా లేకపోవడం, గర్బాశయ ముఖ ద్వారం వీర్యకణాలు లోనికి వెళ్లేందుకు అనువుగా లేకపోవడం, హర్మోన్ల శాతంలో తేడాలుండటం వంటి సమస్యల కారణంగా ఉత్పన్నమవుతోంది. ఇక పురుషుల్లో… వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం, వీర్య కణాల కదలిక, సారూప్యంలో అధికంగా తేడాలుండడం, వీర్య కణాలు ప్రయాణించే నాళాలు మూసుకుపోవడం, హర్మోన్ల శాతంలో తేడాలుండటం, ధూమ, మద్యపాన సేవనం, డ్రగ్స్‌ కు అలవాటు పడడం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినటం, స్థూలకాయం, నిద్రలేకుండా పనిచేయడం, ఇతర జన్యుపరమైన లోపాల కారణంగా సంతానం లేమి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

- Advertisement -

సంతానంలేని దంపతులకు ప్రభుత్వ ఫెర్టిలి టీ సెంటర్లు ఓ వరం.. మంత్రి హరీష్‌రావు

తానం లేని దంపతులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్న ఫెర్టిలిటీ విభాగాలు వరంగా మారనున్నాయి. లక్షల ఖరీదైన సంతాన సాఫల్యత చికిత్స ఇక ఉచితంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానుంది. సంతానం లేని వారి నుంచి ప్రయివేటు ఫెర్టిలిటీ కేంద్రాలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సంతానలేమితో బాధపడుతున్న పేద, సామాన్య దంపతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement