Tuesday, March 26, 2024

తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళ‌న‌.. కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నం..

కేంద్ర ప్ర‌భుత్వం తీరుపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ ఎస్ ఆధ్వ‌ర్యంలో రైతులు ఆందోళ‌న‌కు చేప‌ట్టారు. సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు, వ‌డ్లు కొనుగోలు చేయబోమ‌నే ప్రకటనకు నిరసనగా పెద్ద ఎత్తున ధ‌ర్నాలు, నిర‌స‌లు చేప‌ట్టారు. ఈసందర్భంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ ఎస్ నేత‌లు పాల్గొన్నారు. ప‌లు జిల్లా కేంద్రాల్లో జ‌రిగిన నిర‌స‌న‌ల్లో లీడ‌ర్లు మాట్లాడుతూ.. పంజాబ్‌లో వ‌డ్లు కొంటున్న కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌లో మాత్రం ఎందుకు కొన‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. వానాకాలంతోపాటు, యాసంగి సీజ‌న్‌లో వ‌చ్చే దిగుబ‌డిని మొత్తం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్రం రైతుల మోటార్లకు మీటర్లు పెడతామనడం సరికాదని, రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్‌పై ఇది ప్రభావం చూపుతోంద‌ని విమ‌ర్శించారు.

పంజాబ్‌లో వరిధాన్యం మొత్తం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో పండించిన వడ్ల‌ను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని, తెలంగాణ రైతులు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల‌ని ప‌లువురు నాయ‌కులు సూచించారు. యాసంగిలో పండించే వరిధాన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామ‌ని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. రైతుబంధు, ఉచిత విద్యుత్‌, కాళేశ్వరం జలాలతో తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుంటే.. కేంద్రం చేపడుతున్న వ్యతిరేక విధానాలు మరోసారి రైతులను నట్టేట ముంచేలా ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వరిధాన్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ సంద‌ర్భంగా ప‌లు చోట్ల కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేశారు.

ప‌ర‌కాల‌లో శ‌వ‌యాత్ర‌..
పరకాల నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ ఎస్ ఆధ్వ‌ర్యంలో రైతులు నిర‌స‌న చేప‌ట్టారు. కేంద్ర ప్రభుత్వం (బీజేపీ) రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ తీశారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రధుత్వం కొనాలని డిమాండ్ చేశారు. TRS పార్టీ అధ్వ‌ర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ, దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు ప‌లువు నేత‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement