Thursday, April 25, 2024

భూ వేలానికి అద్భుత స్పందన.. 567 కోట్ల ఆమ్దానీ, అంచనాకు మించిన రాబడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు చేపట్టిన రాజీవ్‌ స్వగృహ ఇండ్లు, లేఅవుట్లలోని ప్లాట్ల వేలానికి అద్భుత స్పందన వస్తోంది. గడిచిన నాలుగు రోజులుగా ఏడు జిల్లాల్లో నిర్వహించిన వేలంలో ప్రభుత్వానికి రూ.567.25 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం గరిష్ట ధరకు మించి కొనుగోలుదారులు భారీ ధరలు వెచ్చించి ఓపెన్‌ ప్లాట్లు, రాజీవ్‌ స్వగృహ ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని విక్రయాలకు రూ.334.72 కోట్లు రాగా నల్గొండ, మహబూబ్‌నగర్‌, గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, వికారాబాద్‌లలో నిర్వహించిన ఓపెన్‌ ప్లాట్ల విక్రయంతో రూ.232 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. హయత్‌నగర్‌ మండలం తొర్రూర్‌లో చదరపు గజం రూ.50 వేలు పలుకగా, ఇక్కడ 69,500 చదరపు అడుగుల స్థలాన్ని విక్రయించాయి. చదరపు అడుగుకు సగటున రూ.27,908 ధర పలికింది. బహుదూర్‌పల్లిలో 77 ప్లాట్లను విక్రయించగా చదరపు సగటున రూ.30,085 ధరతో రూ.140 కోట్ల రాబడి సమకూరింది.

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో 240 ప్లాట్లలో 165 ప్లాట్ల అమ్మకం కాగా ఇక్కడ అత్యధికంగా చదరపు అడుగుకు రూ.13,500 ఆదాయం వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్పూర్‌లో 240 ప్లాట్లు పూర్తిగా విక్రయించాయి. ప్రభుత్వం రూ.8 వేలకు చదరపు గజం నిర్ణయించగా, చదరపు గజానికి అత్యధికంగా రూ.26 వేలు ధరల పలికింది. ఈ వెంచర్‌లో రూ.90.72 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక గద్వాల జిల్లాలో 202 ప్లాట్లు విక్రయానికి ఉంచగా 201 ప్లాట్ల అమ్మకం అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 230 ప్లాట్లకు 217 ప్లాట్లకు మంచి ధర పలికింది. ఆదిలాబాద్‌ జిల్లా మావలలో మూడు ప్లాట్లకు మూడు విక్రయమయ్యాయి. ఇక్కడ రూ.2 కోట్ల ఆదాయం ఆశించగా రూ.3.41 కోట్ల ఆదాయం వచ్చింది. వికారాబాద్‌ జిల్లా యాలాలలో 17 ప్లాట్లకు గానూ నాలుగు ప్లాట్లు విక్రయమయ్యాయి.
హెచ్‌ఎండీఏ పరిధిలో 324 ప్లాట్లకుగానూ 297 ప్లాట్ల విక్రయంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.255 కోట్ల అంచనా వేసుకోగా అద్భుత స్పందనతో రూ.334.72 కోట్ల ఆదాయం సమకూరింది.

అదే విధంగా ఏడు జిల్లాల్లో 1,032 ప్లాట్ల అమ్మకంతో 143 కోట్ల ఆదాయం ఆశించగా కొనుగోలుదారుల పోటీతో రూ.232.52 కోట్ల ఆదాయం సమకూరింది. తాజా వేలంతో రూ.399 కోట్లు ఆశించగా సుమారుగా 80శాతానికిపైగా ఎక్కువ ఆదాయంతో రూ.567.25 కోట్లు రావడంపట్ల హెచ్‌ఎండీఏ పూర్తి సంతృప్తి వ్యక్తంచేసింది. మిగిలిపోయిన ప్లాట్లతో పాటు మరిన్ని రాజీవ్‌ స్వగృహ ప్లాట్లు, స్థలాలను దశల వారీగా వేలం వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఆర్థిక ఏడాది ముగిసే సరికి భారీగా పన్నేతర రాబడిని సమీకరించుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజీవ్‌ స్వగృహ ఆస్తులతో పాటు ఇతర ఆస్తుల వివరాలను వేగంగా సేకరిస్తోంది. రెండు, మూడు రోజుల్లో కలెక్టర్లు సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం మరో విడత వేలం నోటిఫికేషన్‌ జారీ కానున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement