Friday, April 19, 2024

వకీల్ సాబ్ మీద జగన్ కు కక్ష!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’.. ఇవాళ విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఇవాళ రిలీజ్‌ అవుతున్న వకీల్‌సాబ్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ అభిమానుల కోసం శుక్రవారం బెనిఫిట్‌ షోలు ఏర్పాటు చేశారు. అయితే.. తిరుపతిలోని థియేటర్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది.  వకీల్ సాబ్ ఫ్యాన్స్ షోను  సినిమా హాల్లు ప్రదర్శించలేదు.  ఉదయం ఎనిమిది గంటలకు ప్రదర్శించాల్సిన సాధారణ షోలను సైతం నిలిపివేయాలని థియేటర్ల యాజమాన్యానికి నోటీసులు జారీ అయ్యాయి.   ఉదయం ఎనిమిది గంటల షోకు బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులను తిరిగి ఇచ్చేస్తుంది థియేటర్‌ యాజమాన్యం. దీంతో ఆగ్రహం చెందిన ప్రేక్షకులు థియేటర్ పై రాళ్ళ దాడి చేశారు. ఈ ఘటనలో ఓ థియేటర్ అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న రెండు వేల కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. ఇక వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు థియేటర్లు భారీ సంఖ్యలో రావడంతో కోవిడ్ విజృంభించే ఛాన్స్ ఉంది. కోవిడ్ నిబంధనలు కారణంగానే తిరుపతిలో షో వేయడం లేదని తెలుస్తోంది. అయితే, అభిమానులు మాత్రం పవన్ పై సీఎం జగన్ కు కక్ష ఉందంటూ ఆరోపిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే సినిమాకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. గతంలో లానే బెన్‌ఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వాలని.. రాజకీయ కక్ష సాధింపు సినిమాలపై చూపించవద్దని.. రాజకీయాలను, సినిమాలను వేరువేరుగా చూడాలని వారు కోరుతున్నారు. 

మరోవైపు కొత్త చిత్రాల విడుదల సమయంలో ఇప్పటి వరకు కొనసాగిన సంప్రదాయానికి జగన్‌ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండానే బ్రేకులు వేసింది. కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు వారం రోజుల వరకు టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. ప్రముఖ హీరోల చిత్రాలకు ప్రీమియర్‌ షోలు కూడా ప్రదర్శించే అవకాశమూ ఉంది. ఈ రోజు వకీల్‌సాబ్‌ చిత్రం విడుదలకు మొత్తం రంగం సిద్ధమైంది. అన్ని చిత్రాల మాదిరిగానే దీనికీ ప్రీమియర్‌ షో, ధరల పెంపునకు అనుమతి ఉంటుందని ఎగ్జిబిటర్లు భావించారు. కొంతమంది ఏడో తేదీన ప్రీమియర్‌ షోల టికెట్లను పలు థియేటర్లలో విక్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత ఒక ప్రకటన విడుదల చేశారు. వకీల్‌సాబ్‌ చిత్రానికి ప్రీమియర్‌ షోలకు అనుమతి లేదని, టికెట్ల ధరల పెంపునూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడా అధిక ధరలకు టికెట్లు విక్రయించి, ప్రీమియర్‌ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ థియేటర్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఇటీవల విడుదలైన నితిన్‌ చిత్రం ‘రంగ్‌ దే’కు టికెట్‌ ధరలను పెంపును అనుమతించిన రాష్ట్రప్రభుత్వం.. వకీల్‌సాబ్‌ చిత్రానికి అడ్డంకులు ఎందుకు పెడుతోందని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement