Monday, April 15, 2024

బెంగాల్ దీదీ తీర్మార్.. తమిళనాట ఉదయించనున్న నల్ల సూరీడు!

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు గురువారం వెలువడ్డాయి. బెంగాల్ ఎన్నికల తుది విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా సంస్థలు వీటిని విడుదల చేశాయి. కొవిడ్ కాలంలో జరిగిన ఈ ఎన్నికలలో దేశం దృష్టిని ఆకర్షించిన పశ్చిమబెంగాల్‌ తో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికలకు ముందు పలు సంస్థలు చెప్పిన సర్వేల ఫలితాలే పునరావృతమయ్యాయి. నూవ్వా-నేనా..? అన్న రీతిలో సాగిన బెంగాల్ పోరులో మమతా బెనర్జీనే మరోసారి అధికారం దక్కించుకోబోతుందని మెజారిటీ సంస్థలు అంచనా వేయగా.. పలు సర్వేలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. తమిళనాడులో రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి బంపర్ మెజారిటీతో పీఠమెక్కనున్నది. అసోం మీద ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు షాకిస్తూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంపగుత్తగా బీజేపీకే అధికారం కట్టబెట్టాయి. ఇక కేరళలో సాంప్రదాయానికి విరుద్దంగా వరుసగా రెండోసారి వామపక్ష ప్రభుత్వమే కొలువుదీరనుంది. పుదుచ్చేరిలో ఎన్డీయే అధికారం చేజిక్కించుకోనుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి.

మొత్తం 294 స్థానాలకు ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించిన బెంగాల్‌ లో టీఎంసీ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోనుందని మెజారిటీ సర్వేలు అంచనావేశాయి. టీఎంసీకి 152-172, బీజేపీకి 112-132 సీట్లు వస్తాయని ఎన్డీ టీవీ సర్వేలో తేలింది. అధికార పార్టీకి 162-185 సీట్లు, బీజేపీకి 104-121 స్థానాలు వస్తాయని జన్ కీ బాత్ అంచనా వేసింది. కానీ రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ సర్వే మాత్రం టీఎంసీకి 128-138 సీట్లు వస్తాయని, బీజేపీ 138-148 సీట్లతో అధికారం చేపట్టనుందని తెలిపింది.

 ఎన్నికలకు ముందు  అసోంలో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టిన పలు సర్వే సంస్థలు ఆసక్తికరంగా ఆ తర్వాత బీజేపీయే తిరిగి పీఠమెక్కనుందని తేల్చాయి. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో దాదాపు అన్ని సర్వే సంస్థలు బీజేపీకి 70కి పైగా స్థానాలు వస్తాయని అంచనా వేశాయి.

దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ద్రవిడ మున్నెట్ర కజగం (డీఎంకే) అధికారంలోకి వస్తుందని సర్వేలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. తమిళనాట ద్రవిడ ఉద్యమానికి వారసులుగా ఉన్న ఇద్దరు అగ్రనేతలు దివంగత కరుణానిధి, జయలలితలు లేకుండా సాగిన ఈ ఎన్నికలలో స్టాలినే విజేతగా అవతరించబోతున్నారు. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ అధికారాన్ని కోల్పోయి ఇక ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్న డీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తేల్చాయి. జన్ కీ బాత్‌ మినహా ఏ సర్వే సంస్థ కూడా అధికార ఎఐఎడీఎంకే‌కు 60 కి మించి సీట్లు  రావని తేల్చేశాయి. డీఎంకే కూటమి 140 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయి.

మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో  సుమారు 40 ఏళ్ల సాంప్రదాయానికి తెరదించుతూ ఎల్డీఎఫ్ తిరిగి అధికారంలోకి రానుందని సర్వేలు తెలిపాయి. ఎన్డీ టీవీ ఎల్డీఎఫ్‌ కు 76, యూడీఎఫ్‌ కు 62 సీట్లు వస్తాయని అంచనా వేయగా..ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే అయితే వామపక్ష కూటమికి ఏకంగా 104-120 సీట్లను కట్టబెట్టింది. గడిచిన నలభై ఏళ్లుగా కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ ల మధ్య ప్రతి ఐదేళ్లకు అధికారం చేతులు మారుతున్నది.

- Advertisement -

ఇక 30 స్థానాలున్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ కు షాక్ తగలనుందని . ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఎన్డీయే కూటమి ఇక్కడ 20-24 స్థానాలు సాధించి పీఠం అధిరోహించనున్నదని సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్‌ కు 6-10 స్థానాల మధ్య వస్తాయని పేర్కొన్నాయి. కాగా, ఎన్నికల ఫలితాలు మే 2న ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement