Sunday, May 22, 2022

దమ్ముంటే దళిత బంధు అమలు చేయండి : బీజేపీకి మంత్రి హరీష్ రావు స‌వాల్

తెలంగాణ ప‌థ‌కాలు కేంద్రం కాపీ కొడుతుంద‌ని, రెండేళ్ల వ‌ర‌కు ఎన్నిక‌లు లేవ‌ని, మీకు ద‌మ్ముంటే ద‌ళిత బంధు అమ‌లు చేయాల‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు బీజేపీకి స‌వాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి, చీలాపూర్, బెజ్జంకి గ్రామాలలో శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… మిషన్ భగీరథను హర్ ఘర్ జల్ గా కాపీ కొట్టారు. రైతు బంధు లాంటి పథకంను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో తెచ్చారన్నారు. అదే స్పూర్తితో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, దళిత సాధికారిత కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. దళితులపై కపట ప్రేమను ఒలకబోస్తున్న బీజేపీకి నిజంగా వారిపై ప్రేమ ఉంటే వారి అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో దళిత బంధు పథకం ను ప్రవేశ పెట్టి నిధులు కేటాయంచాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

వచ్చే మార్చి 31వ తేదీలోపు ప్రతి నియోజవర్గంలోని కనీసం 100 మందికి దళిత బంధు పథకం క్రింద లబ్ధి అందించాలని సీఎం ఆదేశించార‌న్నారు. వచ్చే బడ్జెట్ లో దళిత బంధు పథకంకు 25 వేల కోట్లు కేటాయించి లబ్దిదారులకు పెద్ద ఎత్తున లబ్ది కలిగేలా చేస్తామ‌న్నారు. తెలంగాణ దళితుల మీద తెలంగాణ భాజపా నాయకులకు ప్రేమ ఉంటే కేంద్రం నుంచి దళిత బంధు పథకం కు నిధులు ఇప్పించాల‌న్నారు. లేదంటే మిగతా తెలంగాణ పథకాల లాగే దళిత బంధు పథకంను కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా దళితులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాల‌న్నారు. దళితుల పేదరికాన్ని పోగెట్టేలా దళిత బంధు పథకంను అమలు చేయాల‌న్నారు. మార్చి 31వ తేదీలోపు రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాలకు దళితబంధు గ్రౌండింగ్ చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో మంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటే తెలంగాణ బీజేపీ వికట ఆనందం పొందుతుంద‌న్నారు. రాష్ట్రంలో 2 ఏళ్లు ఏలాంటి ఎన్నికలు లేవు. మేనిఫెస్టోలో లేకున్నా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేసుకొస్తుంద‌న్నారు. కుల, మత, ఓట్ల రాజకీయం బీజేపీది అయితే.. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ పని చేస్తుందన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు చేతనైతే దళిత బంధు పైసలు తేవాలని.. ఫిబ్రవరి నెల 1వ తేదీన పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ముందు తెలంగాణ రాష్ట్ర దళితుల కోసం 2 లక్షల కోట్లు నిధులు బడ్జెట్ లో పెట్టండని తెలంగాణ బీజేపీ నేతలకు మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement