Wednesday, November 27, 2024

Exclusive – అక్రమాల మిషన్‌ – వక్రమార్గంలో అక్రమ దూత

విదేశీ విశ్వాసులను వంచించి..

వక్రమార్గంఅక్రమంగా సొమ్ము చేసుకుంటున్న దూత

నకిలీ నోట్ల చలామణీలో ఆరితేరిన ఘనుడు

సామాన్యుడి నుంచి వందలకోట్ల అధిపతిగా..

ట్రస్ట్‌ పేరిట యథేచ్ఛగా మనీ ల్యాండరింగ్‌

- Advertisement -

సేవ పేరిట విదేశాల నుంచి విరాళాల సేకరణ

వడ్డీ వ్యాపారం, రియల్‌ ఎస్టే ట్‌ అక్రమ దందా

ఈడీ దృష్టి సారించాలంటున్న స్థానికులు

సమాజంలోని అనాథలు.. అభాగ్యులను అక్కున చేర్చుకొని.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వారికి అండగా నిలవాలన్న సదుద్దేశంతో పరిశుద్ధాత్ముడి విశ్వాసులు వేలకోట్లను విదేశాల నుంచి విరాళాలుగా పంపుతున్నారు… సమాజ శ్రేయస్సు కోరి.. తాము సంపాదించిన మొత్తంలో ఒక భాగం విరాళంగా అందిస్తున్న సహృదయులను వంచించి.. వక్రమార్గంలో ఆ సొమ్మును విలాసాలు.. దర్జాలకు వాడుకుంటూ.. అక్రమ వ్యాపారాలు సాగిస్తున్న ఓ దూత తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి… సామాన్యుడిగా ప్రస్థానం ప్రారంభించి.. నేడు వందల కోట్లకు అధిపతిగా మారి రాష్ట్ర స్థాయిలో మిషన్‌ నడుపుతున్న అక్రమార్కుడి తీరుపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. విదేశీయుల నుంచి వచ్చిన విరాళాలను సైతం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి… దేవుడి సేవ పేరిట ట్రస్టును స్థాపించి.. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ టమే కాక.. రియల్‌ దందా.. వడ్డీ వ్యాపారాలు సాగిస్తున్న మణ ుగూరుకు చెందిన ఘనుడి అక్రమ లావాదేవీలపై విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు… వందల కోట్ల నకిలీ నోట్లను చెలామణి చేయడం ద్వారా కోట్లు కొల్లగొట్టినట్లు సదరు మిషన్‌ నిర్వాహకుడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, ఆంధ్రప్రభ*తన రక్తాన్ని చిందించి, శాంతిమార్గాన్ని నిర్దేశించిన ఏసుప్రభువు ఎందరికో భక్తి మార్గాన్ని నిర్దేశం చేశారు. అంతటి మహానుభావుడు చూపిన భక్తిమార్గాన్ని ఎంచుకొని, సమాజహితం కోరి ప్రభువు బిడ్డలుగా మారి, సేవ చేస్తున్న వారు ఎందరో మనకు తారస పడుతుంటారు. వారిని చూడగానే తెలియని భక్తిభావం మదిలో మెలుగుతుంది.

అయితే సమాజసేవ పేరిట ముసుగు తగిలించుకొని అడ్డదారుల్లో అక్రమాలు సాగిస్తున్న వారు, నిజమైన క్రైస్తవ మిషనరీలకు దీటుగా తమ మిషనరీలను నిర్వహిస్తూ, అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతుండటం క్రైస్తవ విశ్వాసులతో పాటు, సామాన్యులకు సైతం విస్మయం కలిగిస్తోంది.

సమాజ సేవ పేరిట అక్రమార్జనకు అలవాటు పడిన వారంతా చీడ పురుగుల్లా మారి, ప్రభువు పట్ల విశ్వాసం చూపే వారిని దోచుకు తింటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాయాకష్ట ం చేసే ప్రజలకు స్వాంతన చేకూర్చి, ప్రభువు పట్ల విశ్వాసం ప్రదర్శించేలా చేయడంతో పాటు, అభాగ్యులు, అనాథలకు ప్రేమను పంచుతూ, కొందరు నిజాయితీగా కష్ట పడుతూ శాంతిమార్గాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నారు. మరికొందరు కాసులు కూడబెట్టుకునే మార్గంగా మార్చుకొని, అబద్ధాల మేడలు కడుతూ, అసత్య ప్రచారాలు సాగిస్తూ అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు సాక్షాత్తూ కొందరు విశ్వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మనీ ల్యాండరింగ్‌ – రియల్‌ దందా – వడ్డీ వ్యాపారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు కేంద్రంగా ఓ క్రైస్తవ మిషనరీని నడుపుతూ, సామాన్యుడి నుంచి కోట్లాది రూపాయలు పోగేసుకున్న ఓ నిర్వాహకుడి తీరుపై అసలైన క్రైస్తవ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండున్నర దశాబ్దాల కాలంలో వందలకోట్లకు ఎదిగిన సదరు మిషన్‌ నిర్వాహకుడు, చేయని పాపపు పనులు లేవని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.

తనకు తానే దైవదూతగా ప్రచారం చేసుకుంటూ, సదరు మిషన్‌ నిర్వాహకుడు విదేశాల నుంచి వేల కోట్లను విరాళంగా తీసుకు రావడంతో పాటు, చేసేది కొంత – పోగేసుకునేది కొండంత అన్నట్లుగా మారినట్లు వారు ఆరోపిస్తున్నారు.

అభాగ్యులు, అనాథలకు సేవ చేయాలన్న తలంపుతో సహృదయంతో విరాళాలు అందిస్తున్న విదేశీ విశ్వాసులను మాయ చేయడమే కాక, పది మందికి సేవల ందించి, వేల మందికి అందించినట్లు ప్రచారం సాగిస్తూ, సరికొత్త పంథాలో అక్రమార్జనకు పాల్పడుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం, హైదరాబాద్‌ ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల రియల్‌ వ్యాపారం సాగిస్తూ, విదేశాల నుంచి వచ్చిన విరాళాలను దారి మళ్లించి వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారని, చేయని అక్రమ వ్యాపారం లేదని వారు ఆక్షేపిస్తున్నారు.

ఏజెన్సీ ప్రజలను నిండా ముంచేలా మిషన్‌ నిర్వాహకుడు వందల కోట్ల నకిలీ నోట్లను చెలామణి చేసినట్లు ఈ ప్రాంతంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడుపు చేత పట్టుకొని వచ్చిన ఆయన, నేడు వందల కోట్ల అధిపతిగా మారేంత వరకు సాగిన అక్రమ వ్యవహారాలు, మనీ ల్యాండరింగ్‌ విషయాలతో పాటు, ట్రస్ట్‌ పేరిట సాగించిన అక్రమ లావాదేవీలపై విచారణ జరపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

సదరు అక్రమార్కుడు బ్యాంక్‌లో అడుగుపెడితే చాలు, అదే మహాభాగ్యం అన్నట్లుగా మణుగూరులోని బ్యాంక్‌ మేనేజర్లు ఘనస్వాగతం పలకడం, అతగాడి బ్యాంక్‌ లావాదేవీల తీరుకు అద్దం పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

.మిషన్‌ అక్రమ దందాలకు అడ్డుకట్ట పడేనా.?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు కేంద్రంగా ప్రారంభమైన మిషన్‌ అక్రమదందాలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడుతుందా అన్న అనుమానాలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. మణుగూరు నుంచి ఖమ్మం, భద్రాచలం, కొణిజర్ల, హైదరాబాద్‌ శివారు ప్రాంతాలతో పాటు, చత్తీస్‌ఘడ్‌ సరిహద్దు ప్రాంతాలు, గ్రామాల కు సమాజ సేవను విస్తరించినట్లు చెప్పుకుంటున్న సదరు మిషన్‌ నిర్వాహకులు, నిబంధనలకు నీళ్లొదిలి విద్యా వ్యాపారం సాగించడం, అనాథలను ఆదుకుంటున్నామంటూ ప్రచారం జరుపుకొంటూ కాసులు పోగేసుకుంటున్న తీరును స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

విదేశీ నిధులను పక్కదారి పట్టించి, ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపారం సాగించడమే కాకుండా, ఫీజులను భారీ మొత్తంలో వసూలు చేస్తూ, అక్రమాలకు తెరలేపినట్లు వారు ఆరోపిస్తున్నారు. పట్టుమని పదిమందికి కూడా ఉచిత విద్యనందించిన పరిస్థితులు లేవని, రికార్డుల్లో మాత్రం వేలాదిమందికి విద్యనందిస్తున్నట్లు ప్రచారం జరుపుతూ, అనాథలకు ఆశ్రయమిచ్చినట్లు పేర్కొంటూ విదేశీయులను మార్ఫింగ్‌ ఫొటోలతో వంచిస్తున్నారని, వారిచ్చే నిధులతో స్వంత వ్యాపారాలు సాగిస్తున్నారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈడీ ఫోకస్‌ పెడితేనే..

ఎవరూ ప్రశ్నించినా, కాసులతో కట్టడి చేసే మిషన్‌ నిర్వాహకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫోకస్‌ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. మణుగూరు ఏజెన్సీలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, రెండున్నర దశాబ్దాల కాలంలో వందల కోట్ల అధిపతిగా ఎదిగిన తీరును ఈడీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని వారు గుర్తు చేస్తున్నారు. మైనార్టీ మిషన్‌ పేరిట వేల కోట్ల మనీ ల్యాండరింగ్‌ జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈడీ, సీబీఐలు దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.

ఎవరైనా సదరు మిషన్‌ నిర్వాహకుడి తీరును ప్రశ్నిస్తే, నోట్ల కట్టలతో నోర్లు మూయిస్తున్నట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్వతంత్య్ర ప్రతిపత్తి గలిగిన ఈడీ, సీబీఐలు రంగంలోకి దిగాలని, సేవ ముసుగులో విదేశీయులను మోసం చేస్తున్న తీరును వెలుగులోకి తీసుకువచ్చి, కఠిన చర్యలు తీసుకోవాల ని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement