Thursday, April 25, 2024

నేను సీఎం కావాలని ఎప్పుడూ అనుకోలేదు : ఈటల

ఒక బాధ్యత కలిగిన మంత్రిపై కక్ష్యపూరింతంగా వ్యవహరించి అవమానించటం దేశంలో ఇదే మొదటిసారి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2014 వరకే కేసీఆర్‌… ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నారని అన్నారు. తెలంగాణ గాంధీగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి.. ఇవాళ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరివో తప్పుడు సలహాలు, నివేదిక వల్ల తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. తన వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే తానే రాజీనామా చేసేవాడినని ఈటల తెలిపారు. తాను ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదని ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు కేటీఆరే సీఎం కావాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.

తాను అన్ని పార్టీల నాయకులతో మాట్లాడతానని తెలిపిన ఈటల… కాంగ్రెస్‌, బీజేపీ నేతలతో మాట్లాడితే నేరమనే భావన టీఆర్ఎస్ లోనే ఉందన్నారు. తనపై మంత్రులు చేస్తున్న విమర్శలపై స్పందించిన ఈటల… తన గురించి తెలిసి కూడా ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన్ని, న్యాయాన్ని ఎవరూ చెరపలేరన్న ఈటల… ప్రభుత్వాధికారుల బాధ్యతారాహిత్యాన్ని హైకోర్టు నిలదీసినట్లు తెలిపారు. ప్రభుత్వం కర్కషత్వం చూపుతున్నప్పుడు… రాజ్యాంగాన్ని న్యాయస్థానాలు కాపాడతాయనడానికి ఈ సంఘటనే ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గాల నుంచి పేద ప్రజలను కాపాడుతున్నందుకు న్యాయస్థానాలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement