Sunday, May 16, 2021

మంత్రులుగా కాకపోయినా మనుషులుగా చూడండి: ఈటల

సీఎం కేసీఆర్‌పై టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చావడానికైనా సిద్దేమ కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని బ్రతకలేనని అన్నారు. కేబినెట్ మంత్రులుగా కాకపోయినా మనుషులుగా చూడాలని కేసీఆర్ కి హితవు పలికారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పుపట్టారు.

ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఏ ఒక్క మంత్రి కూడా ఆత్మగౌరవంతో ఉన్నామని చెప్పుకోలేరని ఈటల వ్యాఖ్యానించారు. కారు గుర్తు మీద గెలిచామని మీరంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమేనని స్పష్టం చేశారు.  తానూ రాజీనామా చేసేముందు హుజరాబాద్ ప్రజలతో ఒక్కసారి చర్చించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తన రాజకీయ జీవితం తెరిచినా పుస్తకమని, 19 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతిరహిత నాయకుడిగా పేరు సంపాదించుకున్నానని తెలిపారు. ఉద్యమ సమయంలో ప్రలోభ పెట్టిన లొంగలేదని, పార్టీకి, ప్రభుత్వానికి ఏనాడూ మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదని ఈటల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లలేదని, అలాంటి ఉద్యమ నాయకులు మామూలు మనిషినైన తన మీద తన శక్తినంతా ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. భూకబ్జా పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారని ఆరోపించారు.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు విచారణ జరిగిందని మండిపడ్డారు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. జమున హ్యాచరీస్‌ లో తాను డైరెక్టర్‌ను కాదని, అది తన కొడుకు, కోడలికి చెందినదని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఏమాత్రం తప్పున్నా తనను శిక్షించాలన్నారు. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కానని తెలిపారు. వ్యక్తులు శాశ్వతం కాదని.. వ్యవస్థ శాశ్వతం అని పేర్కొన్నారు. భూముల వ్యవహారంలో సంబంధిత గ్రామ సర్పంచ్ ఉదయం ఒక మాట చెప్పారు.. సాయంత్రానికి ఒక మాట మార్చారని ఈ సందర్భంగా ఈటల గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News