Tuesday, April 16, 2024

క్రైస్తవ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయండి.. కేంద్రానికి క్రైస్తవ సంఘాల వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ నిధులతో క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ‘నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ (ఎన్సీఐసీ)’ డిమాండ్ చేసింది. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ 2016-17లో తన వార్షిక నివేదికలో క్రైస్తవ విశ్వ విద్యాలయం ఏర్పాటు కోసం సిఫార్సు చేసిన విషయాన్ని ఎన్సీఐసీ గుర్తుచేసింది. ఢిల్లీలో ఆ సంస్థ ప్రతినిధులు బక్కా పాల్సన్, నెల్సన్ రాబర్ట్, విజయేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ముస్లింల కోసం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఉన్నాయని, అలాగే హిందువుల కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉందని, కానీ క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం లేదని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో క్రైస్తవ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి లక్ష ఉత్తరాలు పంపించే ఉద్యమాన్ని చేపట్టామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే 70 వేల లేఖలు రాశామని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ప్రతినిధులతో పాటు 45 మంది క్రైస్తవ పార్లమెంట్ సభ్యులను కూడా కలిసి మద్ధతు కోరినట్టు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇసాయి మోర్చా పేరుతో క్రైస్తవుల విభాగాన్ని ఏర్పాటు చేసి తాము కూడా లౌకిక పార్టీయేనని సందేశం ఇచ్చిందని వారు గుర్తుచేశారు. విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు ఎంతో సేవ చేస్తున్నాయని, ఈ క్రమంలో కేంద్రం ప్రత్యేక క్రైస్తవ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement