Sunday, May 9, 2021

నాయిని అల్లుడి ఇంట్లో పట్టుబడ్డ రూ.కోటిన్నర నగదు

ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కేసులో శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. ప్రధాన నిందితులు మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి, కాంట్రాక్టర్‌ కంచర్ల శ్రీహరిబాబు, మాజీ కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లతో కలిపి దాదాపు ఏడు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచే నిందితుల ఇళ్లలో ఏకకాలంలో మొదలైన తనిఖీలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిశాయి. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి, మాజీ పీఎస్‌ ముకుందరెడ్డి, అతని బావమరిది వినయ్‌రెడ్డి, ఏడు డొల్ల ఫార్మా కంపెనీల అధినేత బుర్రా ప్రమోద్‌రెడ్డి ఇళ్లల్లో భారీగా నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

నాయిని అల్లుడి ఇంట్లో పట్టుబడ్డ రూ.కోటిన్నర నగదు

నాయిని అల్లుడు వేపా శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో రూ. 1.50 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాయిని కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుంద రెడ్డి బావమరిది ఎం.వినయ్‌రెడ్డి ఇంట్లో రూ. 45 లక్షలు, టెలీహెల్త్‌ సర్వీసెస్‌ మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు బుర్రా ప్రమోద్‌రెడ్డి నుంచి రూ. 1.15 కోట్లు సీజ్‌ చేశారు. మొత్తం ఏడు చోట్ల జరిగిన తనిఖీల్లో రూ. 3.10 కోట్ల నగదుతోపాటు.. రూ. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు, బ్లాంక్‌ చెక్కులు, బ్యాంకు లాకర్ల పత్రాలు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News