Tuesday, March 26, 2024

Web Series ఎస్కేప్​ లైవ్: ఈతరం యువతీ, యువకుల క్రేజీనెస్.. డబ్బుకోసం ఏంచేస్తారంటే!

  • వెబ్ సిరీస్ : ఎస్కేప్ లైవ్
  • మొత్తం ఎపిసోడ్లు: 9 (7 స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. మే 27 ఫైనల్ ఎపిసోడ్స్ ప్రసారం)
  • నటీనటులు: సిద్దార్థ్, జావేద్ జాఫేరి, వాలుస్చా డి సౌజా, ప్లాబితా బోర్తకూర్, సుమేద్ ముద్గల్కర్, రిత్విక్ సాహోర్, రోహిత్ చందేల్, ఆద్యా శర్మ, స్వస్తికా ముఖర్జీ, స్వేత త్రిపాఠి తదితరులు 
  • దర్శకత్వం: సిద్దార్థ్ తివారీ
  • ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్​
  • భాష : హిందీ
  • స్ట్రీమింగ్ డేట్: మే 20 & మే 27 (2 ఎపిసోడ్స్)

 
బొమ్మరిల్లులో హ హ.. హాసినీ అంటూ అమ్మాయి చుట్టూ తిరుగుతూ అల్లరిచేసే సిద్ధార్థ్​ నటన అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లోనూ తనదైన స్టైల్​, మానరిజమ్​తో ఆకట్టుకుంటాడు. ఇక.. అతని నటన గురించి అయితే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమధ్య కాలంలో మూవీస్​ కాస్త తగ్గినా వెబ్ సీరిస్‌తో తన టాలెంట్‌ను చూపించుకొనేందుకు మరో చాన్స్​ అందిపుచ్చుకున్నాడు. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో విడుదలైన ‘ఎస్కేప్ లైవ్’ వెబ్ సీరిస్‌తో సిద్ధార్థ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ తో వచ్చిన ఈ వెబ్ సీరిస్​లో నేటి పరిస్థితులకు చాలా దగ్గరగా సీన్స్​ ఉన్నాయి. మొన్నటి దాకా ‘టిక్ టాక్’, ‘డబ్ స్మాష్’ అంటూ టైంపాస్ చేసిన యువత.. ఇప్పుడు ‘షార్ట్స్’, ‘రీల్స్’, ‘చింగారీ’, ‘టాకా టక్’ అంటూ రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వీటి ద్వారా కొందరు తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తుంటే.. మరికొందరు ఏదో ఒకటి చేసి వైరల్ కావాలనే తాపత్రయంతో దారుణమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వారు చేసిన వీడియోలు వైరల్ అయ్యేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అలాంటి పాత్రలన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన వెబ్ సీరిసే ఈ ‘ఎస్కేప్ లైవ్’. మన చుట్టుపక్కల ఉండే జీవితాలనే కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నాన్ని ఈ సీరిస్‌లో చూపించారు.

అసలు కథ ఎంటంటే.. 

బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌ వేర్​ ఇంజినీర్ కృష్ణ(సిద్దార్థ్)కు తండ్రి లేకపోవడంతో తల్లి, చెల్లి బాధ్యతలను చూసుకోవల్సి వస్తుంది. దీంతో తన అర్హతకు తగిన ఉద్యోగం లభించకపోవడంతో ‘Escaype Live’ లైవ్ అనే షార్ట్ వీడియో యాప్‌లో మానిటర్‌గా చేరుతాడు. కృష్ణ సంప్రదాయాలకు విలువ ఇచ్చే యువకుడు. అయితే, ‘ఎస్కేప్ లైవ్’లో వచ్చే అశ్లీల వీడియోలను బ్యాన్ చేయాలని చూస్తాడు. ఈ సందర్భంగా ఫేటిష్ గర్ల్ అనే యువతి పరిధి దాటుతుందనే కారణంతో ఆమె వీడియోను బ్యాన్ చేస్తాడు. అతడి బాస్ (వాలుస్చా డి సౌజా) ఆదేశాల మేరకు అలాంటి వీడియోలపై చర్యలు తీసుకోలేడు. అంతర్లీనంగా మదనపడుతూ.. ఎలాగైనా ఆ యాప్‌లో అశ్లీలతకు అవకాశం లేకుండా చేయాలని అనుకుంటాడు. ఇందుకు అతడు ఏం చేశాడనేది కండ్లారా చూస్తేనే అర్థం అవుతంది.  

 అయితే.. ఇందులో కేవలం కృష్ణ పాత్ర ఒక భాగం మాత్రమే. కృష్ణతోపాటు మరో ఐదు పాత్రల కథలు సమాంతరంగా సాగుతాయి. ఆ కథలన్నీ ‘ఎస్కేప్ యాప్’పైనే ఆధారపడి ఉంటాయి. ఈ యాప్‌లో ఎన్ని డైమండ్ ఎమోజీలు వస్తే.. వారు అంత పాపులర్ అవుతారు. అందుకు హీనా(ప్లబితా బార్దాకర్) అనే వెయిట్రెస్ ఖాళీ సమయంలో ఫేటిష్ గర్ల్ గా తన అందాలను యాప్‌లో ప్రదర్శిస్తుంది. డార్కీ(సుమేధ్ ముద్గాల్కర్) అనే సైకో యువకుడు ప్రాంక్ వీడియోలతో బాగా పాపులారిటీ సంపాదిస్తాడు. టీవీలో డ్యాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొని పాపులర్ అవ్వాలని కలలగనే తల్లి తన కూతురు రాణి (ఆద్యా శర్మ)ని తన తమ్ముడికి అప్పగిస్తుంది. దీంతో అతడు డ్యాన్స్ రాణిగా ఆమెకు ఎస్కేప్ యాప్‌లో పాపులారిటీ వచ్చేలా చేస్తాడు. ఆమె యువతిలా కనిపించేందుకు తల్లిదండ్రులకు తెలియకుండా హార్మోన్ ఇంజక్షన్లు కూడా చేయిస్తాడు. ఓ సూపర్ మార్కెట్లో పనిచేసే యువకుడు (రిత్విక్ షోరే) డార్కీకి అభిమాని. అతడిలా పాపులర్ అయ్యేందుకు ఆమ్చా స్సైడర్ పేరుతో ఒళ్లు గగూర్పాటు కలిగించే వీడియోలను చేస్తూ అభిమానులను సంపాదించుకొనే ప్రయత్నం చేస్తాడు.

అదే విధంగా బ్యాంక్‌ ఉద్యోగం చేసే రాజ్ కుమార్‌ (రోహిత్ చందేల్)కు సీక్రెట్‌గా మరో జీవితాన్ని గడుపుతాడు. అతడిలోని టాలెంట్ చూపించేందుకు మీనా పేరుతో అమ్మాయి వేషంలో వీడియోలు చేస్తుంటాడు. ఇతడికి సాయం చేసే యువతి పాత్రలో స్వేత త్రిపాఠి కనిపించింది. ‘ఎస్కేప్ లైవ్’ యాప్.. ఎక్కువ డైమండ్స్ సాధించేవారికి రూ.3కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తుంది. అప్పటి నుంచి వీరి జీవితాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతాయి. ఆ రూ.3 కోట్లు సాధించేందుకు వారు ఎంతకు తెగిస్తారు? ఎలాంటి పనులు చేస్తారు? కృష్ణ ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాడు? గెలుపు అంచుల వరకు చేరిన వారికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? చివరికి గెలిచేది ఎవరు? అనేది మిగతా కథ. 

- Advertisement -

కాగా, ఈ వెబ్​సిరీస్​ మొత్తం 9 ఎపిసోడ్స్​ ఉండగా ఇప్పటి వరకు 7 ఎపిసోడ్స్​ అందుబాటులో ఉన్నాయి.. ఇవ్వాల్టి నుంచి (మే 27) మరో రెండు ఎపిసోడ్స్​కూడా స్ట్రీమింగ్​ కానున్నాయి. అయితే.. హీందీ వెర్షన్​లోనే ప్రస్తుతం ఈ వెబ్​సిరీస్​ ఉంది.. థ్రిల్లర్​ డ్రామా జోనరల్​లో ఉన్న ఈ వెబ్​సిరీస్​ ప్రేక్షకులను ఎంతో అలరిస్తోంది. ఒక్కో ఎపిసోడ్​ దాదాపు 48 నిమిషాల సేపు ఉంటుంది.. ఓపికి, తీరిక ఉన్నవాళ్లు తప్పకుండా చూడొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement