Saturday, April 20, 2024

అన్ని క్లాసుల్లోనూ ఇంగ్లీష్ మీడియం.. విమర్శలు కాదు సలహాలివ్వండి : సబితా ఇంద్రారెడ్డి

వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని తరగతుల్లో ఒకే సారి ఇంగ్లీష్‌ మీడియం బోధనను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంను అందుబాటులోకి తెచ్చేందుకు ఆ దిశగా విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తోంది. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మన ఊరు-మన బడి పథకం, సర్కారు బడిలో ఇంగ్లీష్‌ బోధన అంశాలపై విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం విద్యను ప్రవేశపెట్టడంతో పాటు మన ఊరు-మన బడి పథకం ద్వారా రూ.7289 కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించబోతున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఇంగ్లీష్‌ మీడియంతో పాటు తెలుగు మీడియంను సైతం యధావిథిగా కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం 1.03 లక్షల మంది టీచర్లు ఉంటే వాటిలో దాదాపు 60 వేల మంది టీచర్లు ఇంగ్లీష్‌ మీడియంలో బోధించే వారు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే కొంత మందికి ఇంగ్లీష్‌లో శిక్షణను కూడా ఇచ్చామని తెలిపారు.

త్వరలో భర్తీ చేయబోయే టీచర్‌ పోస్టులను ఇంగ్లీష్‌ మీడియం అవసరానికి అనుగుణంగా నియామకం చేపడతామని చెప్పారు. ప్రస్తుతం బదిలీల ప్రక్రియ కొనసాగుతోందని ఖాళీల లెక్క తేలాక త్వరలోనే పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే 25వేల ప్రభుత్వ పాఠశాలల్లో 10 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్‌ మీడియం అందుబాటులోకి వస్తే చాలా మంది తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలోనే చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తారని తెలిపారు. ఇప్పటికే 1 నుంచి 7వ తరగతి విద్యార్థులకు కావాల్సిన ఇంగ్లీష్‌ మీడియం పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని, ఒకే పుస్తకంలో ఒకవైపు తెలుగు, మరో వైపు ఇంగ్లీష్‌ మాధ్యమంలో ఉండేలా ప్రచురించినట్లు మంత్రి చెప్పారు. కోఠి ఉమెన్స్‌ కాలేజీ రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీగా మారబోతున్నట్లు తెలిపారు. ఏ కోర్సులు ప్రవేశపెట్టాలి, విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులు ఏం తీసుకొస్తే మంచిదనే ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు పెంపు అంశం సీఎం పరిధిలో ఉందని మంత్రి తెలిపారు.

అంగన్‌వాడీ పిల్లలకు పాఠ్యప్రణాళిక!…
ప్రభుత్వం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్‌ బోధనను ప్రవేశపెట్టాలని అనుకుంటుంది. అయితే ప్రైవేట్‌ స్కూల్స్‌ తరహాలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలా ఉండే క్లాసులను భర్తీ చేసేందుకుగానూ అంగన్‌ వాడీ సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. అంగన్‌ వాడీ సెంటర్లకు తల్లిదండ్రులు తమ పిల్లలను 3 ఏళ్ల వయసు నుంచే పంపిస్తుంటారు. అంగన్‌ వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం ప్రత్యేకమైన పాఠ్యప్రణాళికను రూపొందించి బ్రిడ్జికోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి సబితా వెల్లడించారు. తద్వారా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అనేవి లేకుండా పిల్లవాడికి ఐదారేళ్లు వచ్చే సరికి నేరుగా ఒకటో తరగతి ఇంగ్లీష్‌ మీడియంలోకి చేరే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. అయితే ఈ అంశాలను పరిశీలిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఇప్పటికే చాలా వరకు అంగన్‌ వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

మొదటి దశలో 9వేల స్కూళ్లు అభివృద్ధి…
మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని 9123 ప్రభుత్వ పాఠశాలలను రూ.4000 కోట్లతో మౌలికసదుపాయాలను కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 26065 పాఠశాలల్లో మండలానికి ఒకటి చొప్పున 35 శాతం పాఠశాల్లో టాయ్‌లెట్లు, తరగతి గదులు, ప్రహరీ గోడ, మంచినీటి సౌకర్యం, డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆతర్వాత మిగితా స్కూళ్లు అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం సర్కారు బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్న విద్యార్థులు 10 లక్షల మంది వరకు ఉన్నారని, గతంలో వీరు చదువులో ఎలా రానించారో.. ఇంగ్లీష్‌ మీడియంలో జాయిన్‌ అయ్యాక ఎలా రానిస్తున్నారనే దానిపై ఒక డాక్యుమెంటరీ తీయబోతున్నట్లు చెప్పారు. ఒకప్పుడు తెలుగుమీడియంలో చదివిన వీరంతా ఇప్పుడు ఇంగ్లీష్‌లో అనర్గలంగా మాట్లాడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

విమర్శలు చేయడం కాదు సలహాలివ్వండి…
మన ఊరు-మన బడి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావొచ్చని, సలహాలు, సూచనలు తమ వంతుగా ఇవ్వొచ్చని మంత్రి పిలుపునిచ్చారు. కొంత మంది నాయకులు అదేపనిగా విమర్శలు చేయడం సరికాదని, సలహాలిస్తే స్వీకరిస్తామని పరోక్షంగా ప్రతిపక్ష నాయకులకు ఆమె చురకలంటించారు. కొన్ని రాజకీయ పార్టీలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాయని ఆమె మండిపడ్డారు. జిల్లా అధికారులు, గ్రామ కమిటీలు, పూర్వ విద్యార్థులు, విద్యావంతుల సహాయంతో బడుల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. సలహాలు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌ను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement