Tuesday, April 16, 2024

క‌బ్జా కోర‌ల్లో దేవుని మాన్యాలు – ల‌క్ష‌లాది ఎక‌రాలు అన్యాక్రాంతం ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలం గాణలో అన్యాక్రాంతమైన భూముల స్వాధీనంపై దేవాదాయ శాఖ దృష్టి సారించింది. ఈ దిశగా ప్రత్యేక కార్యా చరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయిం చింది. రాష్ట్రం లోని వందలాది దేవాల యాల భూములకు సంబం దించిన కేసులు సుదీర్ఘకాలం గా కోర్టులో పెండిం గ్‌లో ఉన్నాయి. ఈ కేసులు త్వరగా పరిష్కా రమైతే తిరిగి దేవాలయాల ఆధీనంలోకి వస్తాయని భావిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు కోర్టుల కేసుల ప్రగతి ఎలా ఉందనే విషయంపై సమీక్షలు నిర్వహించ నున్నారు. కాగా, తెలంగాణ లోని దేవాలయాల పరిధిలో 4 లక్షల ఎకరాలు ఉన్నట్లు అంచనా. వీటిలో దాదాపు లక్ష ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆక్రమణ దారులు ఇప్పటికే ఈ భూములలో షాపులు, గోదాములు వంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణలకు గురైన ఈ భూములపై హక్కులు దేవాలయాలకే చెందుతాయని ప్రభుత్వం వాదిస్తుం డగా, తరతరాలుగా తమ ఆధీనంలోనే ఉన్నందున వాటికి నిజమైన హక్కు దారులం తామే అంటూ కబ్జాదారులు కోర్టులో వాద నలు వినిపిస్తున్నారు. దీంతో ఆలయాల భూముల వ్యవహారం ఎటూ తేలక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా తయారైంది.

ఈ నేపథ్యంలో కోర్టులలో ఉన్న కేసుల విషయంలో ఆక్రమణదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని కోర్టుల ముందు ఉంచాలని అన్ని జిల్లాల ఎండోమెంట్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భూములు, అందులోని నిర్మాణాలకు సంబంధించిన వివరాలు పక్కాగా సేకరించేందుకు ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించాలని పేర్కొన్నారు. లొకేషన్‌ ఆధారంగా చేపట్టే డీజీపీఎస్‌ సర్వే ద్వారా అంగుళం కూడా తప్పి పోకుండా వివరాలు పక్కాగా ఉంటాయని అధికారులు అంటున్నారు. మరోవైపు, దేవాలయాలకు సంబంధించిన కొన్ని వందల ఎకరాలు రైతుల కబ్జాలోకి సైతం వెళ్లినట్లు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయాలలో పట్టాదారు పాసు పుస్తకాలలో పేర్లు మార్పిడి చేయించి పాత రికార్డులు, పత్రాలు తమ పేరిట ఉన్నట్లు చూపించి దర్జాగా ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అంశాన్ని సైతం దేవాదాయ శాఖ అధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవాల్సి వస్తే అందుకు తగిన పరిహారం ఇవ్వాలా ? లేక కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలా ? అనే అంశంపై సైతం దేవాదాయ శాఖ అధికారులు సుదీర్ఘంగా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement