Tuesday, March 26, 2024

విద్యుత్‌ బిల్లు, వినియోగదారుడి జేబుకు చిల్లు.. పెంచిన చార్జీలతో ప్రజలు విలవిల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టాల పేరుతో.. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విద్యుత్‌ శాఖ తీసుకున్న నిర్ణయాలు వినియోగదారుల పాలిట గుదిబండగా మారుతున్నాయి. ఒక వైపు చార్జీల పెంపుతో పాటు అదనపు లోడుతో మరింత బాదుడుకు డిస్కంలు దిగడంతో.. చార్జీల మోతను తట్టుకోలేక సామాన్య ప్రజలు గిలగిలా కొట్టుకుంటున్నారు. పెరిగిన చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కష్టమర్‌ చార్జీలను కూడా రెండింతలు పెంచడం, యూనిట్ల వారీగా ప్రత్యేక రేట్లను డిస్కంలు ఫిక్స్‌ చేశాయి. ఇప్పటీ వరకు ఎన్నడు లేని విధంగా గృహ వినియోగదారులపై ఫిక్స్‌డ్‌ చార్జీల పేరిట ఒక్కో మీటర్‌పై రూ. 10 అదనంగా వసూలు చేస్తోంది. గత నెల కరెంట్‌ బిల్లుతో పోల్చుకుంటే ఈ నెల బిల్లులు భారీగానే పెరిగాయి. యూనిట్ల లెక్కన తీసుకుంటే మార్చి నెలలో 83 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించిన ఒక వినియోగదారుడికి రూ. 188 బిల్లు రాగా.. ఏప్రిల్‌లో 89 యూనిట్ల వాడకానికి ఏకంగా రూ. 307 బిల్లు వచ్చింది.

127 యూనిట్లకు గాను మార్చిలో రూ. 476 బిల్లు రాగా.. ఏప్రిల్‌లో రూ. 639 బిల్లు వేశారు. ఈ నెలలో 413 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకున్నందుకు ఏకంగా రూ. 3,304 బిల్లు రావడం గమనార్హం. అంటే 100 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగానికి ఏకంగా 60 శాతంపైగా చార్జీలు పెరిగాయి. 200 యూనిట్లలోపు వినియోగించే వారికి 27 శాతం చార్జీలను వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈఆర్‌సీ సూచించిన దానికి కంటే డిస్కంలు ఎక్కువగా చార్జీలు వసూలు చేస్తున్నాయని వినియోగదారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగానే కష్టమర్‌ చార్జీలను కూడా రెండింతలు పెంచేశాయి. గతంలో 0 నుంచి 50 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించుకునేందుకు డిస్కంలు రూ. 20 చార్జీగా విధిస్తే .. ఇప్పుడు ఏకంగా రూ. 40 వరకు విధించారు. 50 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు రూ. 40 నుంచి రూ. 70కి పెంచేసింది. 100 నుంచి 200 యూనిట్లకు రూ. 50 ఉండగా ఇప్పుడు రూ. 90 గా డిస్కంలు నిర్ణయించాయి. డిస్కంలు నష్టాల నుంచి తప్పించుకునేందుకు ప్రజలపై 18 శాతం వరకు విద్యుత్‌ భారాన్ని మోపిన విషయం తెలిసిందే. పెంచిన విద్యుత్‌ చార్జీలను ఏఫ్రిల్‌ 1 నుంచి అమలు చేస్తున్నాయి.

2022-23 వార్షిక సంవత్సరానికి రూ. 6,831 కోట్ల విద్యుత్‌ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఈఆర్‌సీకి) ప్రతిపాదనలు చేశాయి. చార్జీల పెంపునకు కమిషన్‌ సైతం ఆమోదం తెలిపింది. పాత టారిఫ్‌తో పోలిస్తే.. యూనిట్ల వారీగా గృహా అవసరాల విద్యుత్‌ వినియోగదారులపై అదనంగా 50 పైసల చొప్పున పెంచుకోవడానికి ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. టారీఫ్‌ను మాత్రమే పెంచుతున్నట్లుగా చెప్పిన డిస్కంలు.. ఇప్పుడు కష్టమర్‌ చార్జీలను డబుల్‌ చేయడమే కాకుండా ఫిక్స్‌డ్‌ చార్జీల పేరుతో రూ. 10లు పెంచి వినియోగదారులపై భారాన్ని మోపుతున్నాయి. పాత టారిఫ్‌ల ఆధారంగా డిస్కంలు రూ. 9,128.57 కోట్ల లోటులో ఉన్నాయని విద్యుత్‌ శాఖ వెల్లడించింది. చార్జీల పెంపు తర్వాత లోటు రూ. 2,686.79 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. చార్జీలు పెంచినా డిస్కంలు అప్పుల్లో ఉండటంతో అదనంగా ఫిక్స్‌డ్‌ చార్జీలు, కష్టమర్‌ చార్జీల పేరుతో డిస్కంలు వసూలు చేస్తున్నాయి.

అదనపు లోడుపేరుతో బాదుడే..
వినియోగదారుడు కొత్తగా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నప్పుడు పరిమిత సంఖ్యలో విద్యుత్‌ వాడకం ఉంటుంది. ఆ తర్వాత వినియోగం పెరిగితే దానికి డిస్కంలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక కిలోవాట్‌ విద్యుత్‌ కనెక్షన్‌ మీటర్‌కు డిస్కంలు రూ. 1250 వరకు వసూలు చేస్తుంటాయి. ఒక కిలోవాట్‌కు పరిమిత యూనిట్లలో విద్యుత్‌ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రెండు బల్బులు, ఒక ఫ్యాన్‌, టీవీ తదితర వస్తువుల వినియోగానికి సరిపోతుంది. అదనంగా ఏసీలు, రిప్రిజరేటర్‌ , కూలర్లు తదితర వస్తువులు వాడితే విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది . దీంతో ట్రాన్స్‌ఫార్మర్స్‌పై అదనపు లోడ్‌ పడుతోంది. ముందుగా ఒక కిలోవాట్‌కు పర్మిషన్‌ తీసుకుని ఆ తర్వాత రెండు లేదా మూడు కిలోవాట్ల వరకు విద్యుత్‌ వాడకం చేపడితే అదనంగా చార్జీలను డిస్కంలు వసూలు చేస్తున్నాయి. అదనపు చార్జీల భారం పడకుండా ఉంటాలంటే మీటర్ల స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీటర్లు మార్చుకోవాలని డిస్కంలు వినియోగదారులకు అవకాశం ఇచ్చినా.. సరైనా ప్రచారం లేకపోవడంతో మెజార్టీగా వినియోగదారులు అటువైపు చూడలేదు. దీంతో వినియోగదారుడిపై మరింత ఆర్థిక భారం పడి ఇబ్బందులకు గురవుతున్నారు.

- Advertisement -

గృహా వినియోగదారులపై యూనిట్ల వారీగా చార్జీలు, యూనిట్లు పాత టారిఫ్‌ కొత్త టారీఫ్‌
………………………………………………………………………………………
0-50 రూ. 1.45 రూ. 1.95
50-100 రూ. 2.60 రూ. 3.10

………………………………………………………………………………………

0- 100 రూ. 3.30 రూ. 3.40
101- 200 రూ. 4.30 రూ. 4.80

………………………………………………………………………………………

0-200 యూనిట్లకు పైగా వినియోగిస్తే

0-200 రూ. 5.00 రూ. 5.10
201- 300 రూ. 7.20 రూ. 7.70
301-400 రూ. 8.50 రూ. 9.00
401-800 రూ. 9.00 రూ. 9.50
800కు పైగా రూ. 9.50 రూ. 10.00

………………………………………………………………………………………

Advertisement

తాజా వార్తలు

Advertisement