Wednesday, April 24, 2024

తెలంగాణలో లాక్‌డౌన్‌పై మరోసారి క్లారిటీ

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌పై మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హుజూరాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే ఛాన్సే లేదని స్పష్టం చేశారు. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలన్నారు. ప్రాణభయంతో ప్రజలు ఆస్పత్రికి వస్తే.. అధిక డబ్బులు వసూలు చేయడం సరికాదని ప్రైవేటు ఆస్పత్రులకు సూచించారు. ఈ సమయంలోనే ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు మానవత్వం ప్రదర్శించాలని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం మార్గం చూసుకోవడం, స్వార్థం కోసం పనిచేయడం పనికిరాదు అని హెచ్చరించారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని మంత్రి ఈటెల కోరారు.

అటు తెలంగాణలో ఆక్సిజన్ కొరత వాస్తవమేనని ఈటల స్పష్టం చేశారు. అయితే ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో కంటే కరోనా వేగంగా విస్తరిస్తోందని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 25 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను కోరామని ఈటెల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement