Friday, April 19, 2024

డాట‌ర్ ఆఫ్ ఫైట‌ర్ – తొణ‌క‌ని .. బెద‌ర‌ని ధీర‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: మూడో రోజు ఈడీ విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత లోపలికి అడుగుపెట్టేటపుడు ఉన్న చిరునవ్వునే పదిగంటల విచారణ తర్వాత కూడా ప్రదర్శించింది. అదే చిరునవ్వు.. అదే గుండె ధైర్యం. తండ్రి కేసీఆర్‌ నుండి సహజంగా అబ్బిన డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ను ప్రదర్శించింది. మూడోరోజు విచారణకు హాజ రయ్యే ముందు పది ఫోన్లు ప్రదర్శించి, ఈడీ డైరెక్టర్‌కు లేఖరాసి వెళ్ళిన కవిత పదిగంటల విచారణలోనూ.. తొణకని, బెణకని ధైర్యం ప్రదర్శించింది… ప్రతీ ప్రశ్నకు స్పష్టమైన సమాధానాలిచ్చింది. గతంలో ఈడీ కేసుల్లో మహా నేతలే ఖంగుతినగా, కవిత మాత్రం ఈడీని ఎదుర్కొన్న తీరు… ఒక చరిత్రగా, దేశంలోనే ఓ సంచలనంగా మారింది. విచారణకు హాజరయ్యేటపుడు చెదరని చిరునవ్వు, విచారణ ముగిశాక విజయసంకేతం చూపిన కవిత గులాబీ క్యాడర్‌లో అంతులేని సంతో షాన్ని నింపింది. మంగళవారం ఉదయం 11.30 గంటల ఈడీ ఆఫీసుకు వెళ్లిన కవిత రాత్రి 9.40 గంటల ప్రాంతంలో బయటికి వచ్చారు. చెరగని చిర్నవ్వుతో, విజయ సంకేతం చూపారు. ఏకంగా 10 గంటల పాటు- జరిగిన తాజా, మూడో దఫా విచారణ ముగియడంతో ఇక ఆమెను పిలిచే అవకాశం లేదని సమాచారం. తదు పరి విచారణలో కవితకు బదులుగా ఆమె న్యాయవాది, బీఆర్‌ఎస్‌ లీగర్‌ అడ్వైజర్‌ సోమ భరత్‌ ద్వారా వివరాలు తీసుకుంటారని తెలుస్తోంది. అందుకే సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో కవిత అభ్యర్థనపై ఆయనను ఈడీ పిలిచి మాట్లాడిందని చెబుతున్నారు.

కవితకు సంబంధించి వాంగ్మూలాలపై, కొన్ని డాక్యుమెంట్లపై ఆమెతో ఈడీ అధికారులు సంతకాలు చేయించుకున్నారని, లాయర్‌ సమక్షంలో ఇది జరగాలని ఆమె కోరినట్లు- తెలుస్తోంది. తాజా విడత విచారణలో ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణలో సౌత్‌ గ్రూప్‌ పాత్ర, ఆప్‌ నేతలకు 100 కోట్ల ముడుపులతో పాటు- కవిత ధ్వంసం చేసినట్లు- చెబుతున్న 10 సెల్‌ ఫోన్లపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లు- తెలుస్తోంది. తను ఫోన్లు పగలగొట్టలేదని, ఈడీనే మీడియాకు అలా లీకులు ఇచ్చిందని కవిత మండిపడింది. మంగళవారం ఉదయం తను వాడిన ఫోన్లను పట్టు-కొచ్చి మీడియాకు ప్రదర్శించారు. ఇది ఈడీకి ఇబ్బందికరంగా మారింది.

24న విచారణ లేనట్లే?
ఈ కేసులో ఈడీ దర్యాప్తును సవాలు చేస్తూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయడం తెలిసిందే. ఆ కారణంగానే ఆమె ఈ నెల 16నాటి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. 24న సుప్రీం కోర్టు వెలువరించే నిర్ణయాన్ని బట్టి ఆమెను మళ్లీ విచారించడం, లేకపోతే ఇతర చర్యలం తీసుకోవడం వంటి అంశాలను ఈడీ పరిశీలించనుంది. కవితను ఈడీ ఈ నెల 11న తొలిసారి విచారించింది. తర్వాత 16న విచారణకు పిలవగా సుప్రీం కోర్టులో తన పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని, ఈడీ నిబంధనలకు విరుద్ధంగా విచారిస్తోందని గైర్హాజరయ్యారు. తర్వాత ఈ నెల 20న రెండోసారి, 21న మూడోసారి ఆమెను విచారించారు.

ఢిల్లీలో కేటీ-ఆర్‌, హరీష్‌
కవిత విచారణ సందర్బంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎదుర్కోడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. విచారణను దీటు-గా ఎదుర్కొన్నే సమాచారాన్ని సేకరిస్తోంది. లిక్కర్‌ స్కాంలో కవిత పాత్ర ఉందంటూ ఈడీ, సీబీఐ పేర్కొన్న అంశాలను తిప్పికొట్టేందుకు లీగల్‌ టీ-మ్‌ కసరత్తు చేస్తోంది. మంత్రులు కేటీ-ఆర్‌, హరీశ్‌ రావుతోపాటు- కవిత భర్త అనిల్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలోనే మకాం వేసి ఈడీ కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికే బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి సన్నాహాలు చేశారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతూ అత్యంత వ్యూహాత్మకంగా కవిత ఈడీ విషయంలో వ్యవహరించి, ఈడీనే ఆత్మరక్షణలో పడేసిందన్న చర్చ నేషనల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement