Friday, April 19, 2024

ఈటల రాజీనామాకు ఉన్న అడ్డంకి ఏంటి?

మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరడం ఖాయం అయింది. ఇప్పటికే బీజేపీలో చేరికపై ఢిల్లీ వెళ్లి ఆపార్టీ అధినాయకత్వాన్ని కలిసి చర్చించారు. అయితే, అధికారికంగా ఇంకా చేరలేదు. రేపోమాపో చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే బీజేపీలో చేరడానికి ముందే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? లేక ఆ తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటారా ? అన్నదానిపై స్పష్టత లేదు. మ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని అన్నారు. ఎలాంటి హామీ లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. అయితే బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్న ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? లేక బీజేపీలో చేరినా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారా ? అన్నది తేలాల్సి ఉంది. హుజూరాబాద్ కు ఉప ఎన్నిక రాకుండా బీజేపీలో చేరినా ఎమ్మెల్యేగానే కొనసాగాలని భావిస్తున్నారా? అసలు ఈటల మనసులో ఏముంది? అన్నది ఉత్కంఠగా మారింది. పార్టీలో చేరితే రాజ్యసభ పదవి ఇస్తామని ఈటలకు బీజేపీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, బండి మాత్రం ఈటలకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, అయినా ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. దీంతో ఈ అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్.. ఆయనను పార్టీ నుంచి మాత్రం ఇంకా సస్పెండ్ చేయలేదు. ఈటలను పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ టీఆర్ఎస్ నాయకులు పార్టీ అధిష్టానానికి లేఖను సైతం పంపారు. అయితే, దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈటల ఢిల్లీ టూర్, నడ్డాతో భేటీపై ఆరా తీసిన కేసీఆర్… ఆయనపై చర్యలకు సిద్ధమైయ్యారని ప్రచారం జరిగింది. ఈటల బహిష్కరణకు సంబంధించిన అంశంపై తమ అధినేత కేసీఆర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారిన ఆపార్టీ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా అన్నారు. అయితే, కేసీఆర్ మాత్రం ఈటల సస్పెన్షన్ విషయంలో అచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈటలను సస్పెండ్ చేస్తే ఆయనకు ఇతర పార్టీలోకి వెళ్లే స్వేచ్ఛ లభిస్తుందనే ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ అలా చేయలేదనే చర్చ జరుగుతోంది. అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే బీజేపీలో చేరితే ఆయన విషయంలో టీఆర్ఎస్ ఏ రకంగా వ్యవహరిస్తుంది ? ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా ? లేక స్పీకర్ ద్వారా ఆయనపై చర్యలు తీసుకుంటుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని మంత్రులుగా చేశారు కేసీఆర్. ఒక పార్టీ నుంచి గెలిచిన వారిని రాజీనామా చేయించకుండా టీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్.. ఈటల విషయంలో రాజీనామా చేయమని అడిగితే ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement