Tuesday, April 16, 2024

ఈటలనే కాబోయే సీఎం!

తెలంగాణకు కాబోయే సీఎం ఈటల రాజేందర్. ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. తెలంగాణలో కుటుంబ పాలనకు చెక్ పెట్టాలంటే ఈటల సీఎం కావాల్సిందే. ఇదీ ఈటల అనుచరుల మాట. రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీతో ప్రజల్లోకి వెళ్లాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులను కూడా సైలెంట్ గా చకచక చేస్తున్నారు. కొంతకాలంగా సీఎం కేసీఆర్​తో విభేదాలు ఉండడం… హఠాత్తుగా కబ్జా ఆరోపణలు రావడంతో తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని భావిస్తున్న ఈటల.. టీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమైయ్యారు.

కొద్ది రోజుల క్రితం హుజూరాబాద్‌కు వెళ్లినప్పుడు ఆయన ‘తాను మళ్లీ మంత్రి హోదాలో రాకపోవచ్చని’ వ్యాఖ్యానించారు. అనంతరం భూకబ్జాకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు రావడం, వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారణకు ఆదేశించిండం, మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఈ నేపధ్యంలో రెండు రోజులు క్రితం సొంత నియోజకవర్గం హుజూరాబాద్ వెళ్లిన ఈటలకు ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు ఘటన స్వాగతం పలికారు. గ్యాప్ లేకుండా అన్నీ వర్గాల ప్రజలు, కార్యకర్తలతో ఈటల చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు ఈటల సీఎం అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిపక్షాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మరో పార్టీని స్థాపించేందుకు ఈటల రెడీ అవుతున్నారు.

మొన్నటి వరకు ఈటల రాజేందర్ పై మౌనం వహిస్తున్నట్లే కనిపించిన గులాబీ నేతలు ఇప్పుడు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్లు ఈటల వ్యవహారంపై విమర్శలు గుప్పించగా… అంతే ధీటుగా అటువైపు నుంచి కూడా కౌంటర్ మొదలైంది. టీఆర్ఎస్ లో అంతా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతారని… రాసిచ్చింది మాట్లాడటం తప్ప సొంతంగా మాట్లాడే అధికారం ఎవరికీ లేదని మంత్రులు కొప్పులు,గంగులకు ఈటల కౌంటర్ ఇచ్చారు. వ్యక్తులు ఇవాళ ఉంటారు.. ఆ తర్వాత పోతారు… కానీ ధర్మం ఎక్కడికీ పోదు. ప్రభుత్వం దుర్మార్గ వైఖరికి తాను కోర్టు ద్వారానే బదులిస్తానని అన్నారు. 2014 వరకే కేసీఆర్ ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నారు. తెలంగాణ గాంధీగా పేరు గాంచిన గొప్ప వ్యక్తి ఇవాళ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.  ఒక మనిషికి ఒక పార్టీ, వ్యక్తితో మాట్లాడే అవకాశం,స్వేచ్ఛ ఉండదా అని ప్రశ్నించారు. 2014 కంటే ముందు కాంగ్రెస్ మంత్రుల దగ్గరకు వెళ్లి అభివృద్ధి పనులు తెచ్చుకోలేదా? అని నిలదీశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు టీఆర్ఎస్ మంత్రులను కలవడానికి వస్తే ఫిక్స్ అయిపోయిందా? అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇతర పార్టీల నేతలతో మాట్లాడితే తప్పా? ఇకపై అన్ని పార్టీల నాయకులతో మాట్లాడతానని ఈటల చెప్పారు.

 

ఈ క్రమంలో పలు సంఘాలు, తనతో కలిసి వచ్చే రాజకీయ నాయకులతో వరుస భేటీలు జరుపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నుంచి కూడా ఈటలకు భారీగా మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. బయటకు చెప్పకపోయిన ఇప్పటకే ఆయా పార్టీల కీలక నేతలు ఈటలతో టచ్ లో ఉన్నారని రాజకీయ వర్గాల భోగట. ఈ క్రమంలో అందరి మద్దతుతో రాష్ట్రంలో కొత్త పార్టీకి అడుగులు వేస్తున్నారని సమాచారం. భవిష్యత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించాలని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ లేదు. ఇక దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగినా.. ప్రస్తుతం ఆపార్టీల్లో చేరిన పెద్దగా ఉపయోగం లేదని ఈటల వర్గం భావిస్తోంది. అందుకే కొత్త పార్టీతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఏర్పడితే.. భవిష్యత్ లో సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందనేది ఈటల వర్గం అంటోంది.

- Advertisement -

టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత 2003లో ఈటల ఆపార్టీలో చేరారు. 2004లో కరీంనగర్‌ జిల్లాలోని కమలాపూర్‌ నియోజకర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2009లో హుజూరాబాద్‌ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి వరుసగా గెలుపొందారు. మొదటి నుంచీ కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ఆయనకు 2014లో తెలంగాణ ఆవిర్భవించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలకమైన ఆర్థిక మంత్రిత్వశాఖ లభించింది. మొదట్లో బాగానే ఉన్నా కొంతకాలం తర్వాత దూరం పెరిగినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. 2018లో శాసనసభ ఎన్నికల్లో రెండోసారి టీఆర్ఎస్ గెలిచిన తర్వాత మొదట మహమూద్‌ అలీ ఒక్కరే కేసీఆర్‌ తో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మంత్రివర్గ విస్తరణలో కూడా చివరి వరకు ఈటల స్థానంపై ఊగిసలాట జరిగి ఆఖరి నిమిషంలో మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. రెండోదఫా ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్పగించారు. అయితే క్రమంగా విభేదాలు ఎక్కువయ్యాయనే అభిప్రాయం ఉంది. అయితే, పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ కంటే ఈటల గ్రాఫ్ భాగా పెరిగింది. అందుకే పలు సందర్భాల్లో విపక్ష పార్టీలు సైతం సీఎంగా కేటీఆర్ కంటే ఈటల బెటర్ అనే వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement