Thursday, April 25, 2024

పాకిస్థానీ ఫిషింగ్ బోటులో రూ.200కోట్ల విలువైన డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌-ఆరుగురి అరెస్ట్

అరేబియా స‌ముద్రంలో భార‌త జ‌లాల్లోకి ప్ర‌వేశించిన పాకిస్థానీ ఫిషింగ్ బోటులో హెరాయిన్ ని త‌ర‌లిస్తుండ‌గా అధికారులు గుర్తించి డ్ర‌గ్స్ ని సీజ్ చేశారు. గుజరాత్‌ సముద్ర తీరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ టీమ్, గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 40 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోటులో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో సుమారు రూ.200 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు.

కోస్ట్ గార్డ్, ఏటీఎస్ సంయుక్త బృందం కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో సముద్రంలో మాదక ద్రవ్యాలను తీసుకెళ్తున్న మత్స్యకార పడవను అడ్డగించిందని ఓ అధికారి తెలిపారు. హెరాయిన్‌ను గుజరాత్‌ తీరంలో ల్యాండ్‌ చేసిన తర్వాత రోడ్డు మార్గంలో పంజాబ్‌కు తీసుకెళ్తున‌ట్టు తెలిపారు. నిఘా వ‌ర్గాల పక్కా సమాచారం మేరకు పాకిస్థాన్ నుంచి వచ్చిన పడవను అడ్డగించి ఆరుగురు పాకిస్థానీ పౌరులను అదుపులోకి తీసుకున్నామని, వీరి నుంచి 40 కేజీల హెరాయిన్ లభ్యమైందని, సీజ్ చేసిన పడవతో పాటు ఏటీఎస్, కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా గుజరాత్ ఏటీఎస్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కొన్ని నెలల క్రితం కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు. డీఆర్‌ఐ సహకారంతో గుజరాత్ ఏటీఎస్ మరోసారి భారీ చర్య తీసుకోవడం ద్వారా భారీ డ్రగ్స్‌ను పట్టుకోగలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement