Wednesday, April 24, 2024

వ్యవసాయంలో డ్రోన్లు.. టెక్నాలజీని ప్రోత్సహించనున్న కేంద్రం

దేశంలో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్‌ మునుపటి మార్గదర్శకాలను సవరించింది. వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున డ్రోన్‌ టెక్నాలజీ ప్రదర్శనలకు ప్రోత్సాహం ఇవ్వనుంది. వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరీక్షా సంస్థలు, ఐసిఏఆర్‌ సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలు కొనుగోలు చేసే డ్రోన్‌ ఖరీదులో 100శాతం లేదా పది లక్షల రూపాయల వరకు (ఏది తక్కువ అయితే అది) గ్రాంటుగా లభిస్తుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కొనుగోలు చేసే వ్యవసాయ డ్రోన్‌ ఖర్చులో 75శాతం వరకు గ్రాంట్‌ పొందవచ్చు. అయితే, డ్రోన్లను కొనుగోలు చేయకుండా డ్రోన్లను అద్దె కు తీసుకుని ప్రదర్శనలు నిర్వహించే సంస్థలకు హెెక్టార్‌కి 6000 రూపాయలను వ్యయ ఖర్చుగా చెల్లించడం జరుగుతుంది. ఈ సంస్థలు హైటెక్‌ హబ్‌లు, డ్రోన్‌ తయారీదారులు మరియు స్టార్ట్‌-అప్‌ల నుంచి డ్రోన్‌లను అద్దెకు తీసుకోవలసి ఉంటుంది. 2023 మార్చి 31 వరకు ఆర్థిక సహకారం, గ్రాంటుల చెల్లింపు అమలులో ఉంటాయి.

అదేవిధంగా అద్దెకు ఇచ్చేందుకు డ్రోన్లను కొను గోలు చేసే రైతుల సహకార సంఘాలు , ఎఫ్‌పిఓ, గ్రామీణ పారి శ్రామికవెత్తలకు డ్రోన్‌ ఖరీదు, దాని అనుబంధ పరికరాల ఖరీదులో 40శాతం లేదా రూ. 4లక్షలు (ఏది తక్కువ అయితే అది) ఆర్థిక సహకారంగా అందించడం జరుగుతుంది. కస్టమ్‌ హరింగ్‌ కేంద్రాలను స్థాపించే వ్యవసాయ గ్రాడ్యుయేట్‌లు డ్రోన్‌ దాని అటాచ్‌మెంట్‌ల ప్రాథమిక ధరలో 50 శాతం లేదా డ్రోన్‌ కొనుగోళ్లకు రూ.5 లక్షల వరకు గ్రాంట్‌ సహాయంగా పొందవచ్చు. గ్రామీణ పారిశ్రామిక వేత్తలు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండి డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ గుర్తింపు పొందిన సంస్థ లేదా గుర్తింపు పొందిన రిమోట్‌ పైలట్‌ శిక్షణా సంస్థ నుంచి లైసెన్స్‌ కలిగి ఉండవలసి ఉంటుంది. ఈ చర్య సామాన్యులకు డ్రోన్‌లను మరింత అందుబాటులోకి తెచ్చి దేశీయ డ్రోన్‌ ఉత్పత్తిని గణనీయంగా ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement