Thursday, April 25, 2024

AgriCulture: డ్రోన్‌ సాగు స‌క్సెస్‌.. తాండూరులో పరిశోధనలు విజయవంతం!

ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా చేప‌ట్టిన డ్రోన్ సాగు స‌క్సెస్ అయ్యింది. రెండేళ్లుగా వికారాబాద్ జిల్లాలోని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహిస్తున్న డ్రోన్‌ సాగు పరిశోధనలు విజయవంతం అయ్యాయి. పరిశోధనలు పూర్తి అయిన సందర్భంగా శనివారం రైతుల సమక్షంలో డ్రోన్‌ సహాయంతో మందుల పిచికారి ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ విషయాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త, హెడ్‌ డాక్టర్‌ సుధారాణి వెల్లడించారు. కంది పంటపై డ్రోన్‌తో మందుల పిచికారికి సంబంధించి తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రయోగాలు నిర్వహించారు.

– ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌

ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో డ్రోన్‌లతో మందుల పిచికారి జరుగుతోంది. అయితే ఇందుకు నిర్దిష్ట విధానం(స్టాండర్ట్‌ ప్రొసీజర్‌) అనేది లేదు. ఎంత మొత్తం రసాయన మందులు వాడాలి, పంటలకు సోకిన తెగుళ్లు..చీడపీడలను దృష్టిలో ఉంచుకొని ఎంత మేరకు మందులను వాడాలి, ఎకరం విస్తీర్ణంలోని పంటకు ఎంత మొత్తం నీటిని వాడాలి, ఎంత ఎత్తు నుంచి మందులను పిచికారి చేయాలని, డ్రోన్‌తో రసాయన మందులను పిచికారి చేసే సమయంలో రైతులు, డ్రోన్‌ పైలెట్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఎలాంటి విధానం లేదు. ఇష్టానుసారంగా డ్రోన్‌తో మందుల పిచికారి జరుగుతోంది. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ వినియోగం పెరగడంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖలు సంయుక్తంగా డ్రోన్‌ పరిశోధనలకు సిద్దమయ్యాయి.

డ్రోన్‌ సాగుపై పరిశోధనలకు జిల్లాలోని తాండూరులో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానంను ఎంపిక చేశారు. ఇక్కడ రెండేళ్లుగా మారుత్‌ డ్రోన్స్‌ అనే ప్రైవేటు సంస్థతో కలిసి డ్రోన్‌తో మందుల పిచికారిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వివిధ పంటలపై డ్రోన్‌తో మందుల పిచికారికి సంబంధించి అనేక ప్రయోగాలు జరిగాయి. శనివారం పరిశోధనలు విజయవంతం కావడంతో రైతుల సమక్షంలో ట్రయల్స్‌ నిర్వహించి డ్రోన్‌తో మందుల పిచికారి ఎలా చేయాలి అనేది వెల్లడించారు. ఈ సందర్భంగా పరిశోధన స్థానం హెడ్‌ డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ సరికొత్త విప్లవం సృష్టిస్తుందని అన్నారు. డ్రోన్‌లు రైతులకు మేలు చేయడంతో పాటు యువతకు ఉపాధి కూడా చూపుతుందని పేర్కొన్నారు.

తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలోని పొలంకు డ్రోన్‌తో మందులను పిచికారి చేసుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ రాజేశ్వర్‌రెడ్డి, సుజాత, యమున, సందీప్‌, వ్యవసాయ శాఖ ఏడీ రుద్రమూర్తి, వ్యవసాయ శాఖకు చెందిన మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement