Thursday, April 25, 2024

ఇంటి తలుపుకి గులాబీరంగు.. రూ.19లక్షల జరిమానా

తన ఇంటి ద్వారానికి గులాబీ రంగు వేసిందని ఓ మహిళకి రూ.19లక్షల జరిమానా విధించారు స్కాట్లాండ్ అధికారులు. ఇంటిముందు ఉండే ప్రధాన ద్వారానికి నచ్చిన రంగు వేసుకుంటానంటే కుదరదట. స్థానిక కౌన్సిల్ సూచించిన రంగునే వేయాలని, వేరే రంగువేస్తే భారీ జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ కు చెందిన మిరండా డిక్సన్ తన ఇంటికి ఇటీవలే మరమ్మతులు చేయించారు. ఈ పనుల్లో భాగంగా ప్రధాన ద్వారానికి గులాబీ రంగు వేయించారు. దీనిపై ఎడిన్ బర్గ్ సిటీ కౌన్సిల్ ప్లానర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ నిర్ణయించిన ప్రకారం తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. గులాబీ రంగు తలుపులతో తన ఇంటికే అందం వచ్చిందని డిక్సన్ చెప్పారు. వీధిలో వెళ్లే వాళ్లను తన ఇల్లు ఎంతగానో ఆకర్షిస్తోందని, క్షణం ఆగి ఓ సెల్ఫీ తీసుకొని మరీ వెళుతున్నారని వివరించారు. తలుపుల రంగు మార్చడం తనకిష్టంలేదని తేల్చిచెప్పారు. దీంతో కౌన్సిల్ అధికారులు డిక్సన్ కు 20 వేల పౌండ్ల (మన రూపాయల్లో సుమారు 19 లక్షలు) జరిమానా విధించారు. కౌన్సిల్ ఆదేశాలను ధిక్కరించి ఇంటి తలుపులకు గులాబీ రంగు వేసినందుకు ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement