Thursday, May 26, 2022

అలా చేస్తేనే గొప్ప అనుకోవద్దు.. మేయర్లు, కౌన్సిలర్లకు కేటీఆర్​ స్ట్రాంగ్​ వార్నింగ్​!

మున్సిపల్​ మేయ‌ర్లు, చైర్మ‌న్లు, కౌన్సిల‌ర్ల‌కు మంత్రి కేటీఆర్ సుతిమెత్త‌గా చుర‌క‌లంటించారు. మున్సిప‌ల్ అధికారుల‌పై అరిస్తే.. గొప్ప అనుకునే వారిని హెచ్చ‌రించారు. అధికారిక స‌మావేశాల్లో అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌లు జ‌రిపి, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం చేసుకునే దిశ‌గా ముందుకు వెళ్లాల‌ని సూచించారు. హైదరాబాద్​లోని వెంగ‌ళ్రావు న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం స‌మీక్ష సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి కేటీఆర్ తో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. మంత్రుల సమీక్షకు మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కమిషనర్లు, మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమ విధివిధానాలపై మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ దిశానిర్ధేశం చేశారు. అనంతరం రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి అవార్డులను మంత్రులు అందజేశారు.

రాష్ట్రంలోని నగరాలు, పట్టణవాసులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టిందని, ఇందులో భాగంగా వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం పారిశుధ్య కార్యక్రమాలు, నీటి నిల్వల తొలగింపు, దోమల నివారణకు మందుల స్ప్రేయింగ్‌, చెత్త తొలగింపు, రహదారుల వెంట పిచ్చి మొక్కలు, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, ఖాళీ స్థలాల్లో హరితహారం వంటి పనులను నిర్వహించనున్నట్టు చెప్పారు. ఐదోవిడత పట్టణ ప్రగతి కార్యక్రమం ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు చేపడుతున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement