Saturday, April 20, 2024

సాఫ్ట్‌వేర్ పార్కుల కేటాయింపులోనూ వివ‌క్ష‌.. కేంద్రంపై మరోసారి భగ్గుమన్న కేటీఆర్

సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కేటాయింపులోనూ తెలంగాణ‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివ‌క్ష చూపింద‌ని మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. కేంద్రం తాజాగా ప్రకటించిన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కుల్లో (ఎస్టీపీఐ) ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించక‌పోవ‌డంపై ఆవేదన వ్యక్తం చేశారు. యూపీ, ఎంపీ, గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బిహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాల‌కు 22 ఎస్టీపీఐల‌ను కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు ఒక్క‌టికూడా కేటాయించ‌క‌పోవ‌డం అన్యాయ‌మ‌న్నారు. ఈ విష‌యంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ‌.. దేశ ఐటీ పరిశ్రమలో అద్భుతంగా రాణిస్తున్న రాష్ట్రాల్లో ఒక‌ట‌ని, కొన్నేళ్లుగా జాతీయ సగటు కన్నా ఎక్కువ వృద్ధిరేటును న‌మోదుచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

2014-15వ సంవత్సరానికి రూ. 57,258 కోట్లున్న‌ ఐటీ ఎగుమతులు.. తాజాగా, రూ. 1,45,522 కోట్లకు పెరిగాయ‌ని, ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపైంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం త‌మ రాష్ట్రంలోని ఐటీరంగంలో 6,28,000పైగా మంది ప‌నిచేస్తున్నార లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు భవిష్యత్తు వృద్ధిని చాటే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విషయంలోనూ తెలంగాణ బెంగళూరును పదే పదే దాటుతున్న విషయాన్నినొక్కిచెప్పారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం అనేక పాలసీపరమైన నిర్ణయాలు తీసుకున్న‌ద‌న్నారు. ఎలక్ట్రానిక్, రూరల్ టెక్నాలజీ, ఇమేజ్, డేటా సెంటర్‌లాంటి వివిధ‌ రంగాలకు ప్రత్యేకమైన పాలసీలతో ఐటీ రంగ అభివృద్ధిని సాధిస్తున్న విషయాన్ని, అయా పాలసీలకు దేశవ్యాప్తంగా దక్కుతున్న ప్రశంస‌లను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తన లేఖలో ప్రస్తావించారు.

హైదరాబాద్.. దేశ ఐటీ రంగంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఒక ప్రముఖమైన ఐటీ హబ్‌గా మారిందని, హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద‌ కంపెనీలు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని మంత్రి కేటీఆర్ లేఖ‌లో తెలిపారు. కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంతోపాటు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పాలసీ పరమైన నిర్ణయాలతోపాటు మౌలిక వసతులు క‌ల్పిస్తున్న‌ విషయాన్ని వివ‌రించారు. ఇప్పటికే తెలంగాణ స‌ర్కారు ఆయా పట్టణాల్లో ఏర్పాటు చేసిన ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను వినియోగించుకొని వివిధ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు.

ఇంత పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్న నేపథ్యాన్ని పట్టించుకోకుండా ఎస్టీపీఐ కేటాయింపుల్లో తెలంగాణను పరిగణలోకి తీసుకోకపోవడం దారుణ‌మ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడి యువత ఉపాధి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని మండిప‌డ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్ (ఐటీఐఆర్) రద్దు చేసి, తెలంగాణ ఐటీ రంగానికి, యువతకు తీరని ద్రోహం చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

ఈ ఐటీఐఆర్ పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోడీని కలిసినా, ఐటీ మంత్రిగా తాను, తమ ఎంపీల బృందం పదేపదే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తులు చేసినా స్పంద‌న లేద‌న్నారు. పైగా ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కుల కేటాయింపులో సంపూర్ణంగా తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్ర వివక్షపూరిత వైఖరికి నిదర్శనమన్నారు.

- Advertisement -

దేశంలో అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తే..అది దేశ హితానికి, పురోగతికి తోడ్పడుతుందన్న ఆలోచనను, విశాల దృక్పథాన్ని కేంద్రం అంగీకరించాల‌ని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి సాఫ్టేర్‌ టెక్నాలజీ పార్కులను కేటాయించే విషయాన్ని పునఃపరిశీలించాలని లేఖ‌లో కోరారు. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ పట్టణాలకు ఎస్టీపీఐల‌ను కేటాయించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement