Saturday, April 20, 2024

TS | ఈ-గరుడ బస్సు చార్జీల తగ్గింపు.. ప్రారంభ కానుకగా నెల రోజులు చాన్స్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొత్తగా ప్రవేశపెట్టిన ఈ గరుడ ఎలక్ట్రిక్‌ బస్సుల టికెట్‌ ధరలను తగ్గిస్తున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. కొత్త బస్సుల ప్రారంభం సందర్భంగా నెల రోజుల పాటు ఈ-గరుడ బస్సుల్లో చార్జీలు తగ్గిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం టీఎస్‌ ఆర్టీసీ రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ శ్రీధర్‌ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. మియాపూర్‌ నుంచి విజయవాడకు ముందుగా నిర్ణయించిన ధర రూ.830 కాగా, తగ్గించిన ధర రూ.750గా ఉంది. అలాగే, ఎంజీబీఎస్‌ నుంచి విజయవాడకు ముందుగా తగ్గించిన ధర రూ.780 కాగా, తగ్గించిన ధర రూ.710గా ఉంది. నెల రోజుల పాటు ప్రయాణికులు తగ్గించిన ధరలకు వినియోగించుకోవచ్చని శ్రీధర్‌ తెలిపారు.

కాగా, హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో మంగళవారం ఈ-గరుడ పేరుతో 10 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ లాంఛనంగా ప్రారంభించారు. దశలవారీగా మరో 50 ఎలక్ట్రిక్‌ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మిగతా బస్సులను ఈ ఏడాది చివరి నాటికి తీసుకొచ్చేలా సంస్థ ప్రణాళికను రూపొందించింది. ఇవి వస్తే ప్రతీ 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, మియాపూర్‌ నుంచి విజయవాడకు ఉదయం 6.25 నిమిషాల నుంచి రాత్రి 21.45 వరకు అలాగే, ఎంజీబీఎస్‌ నుంచి ఉదయం 8-10 నిమిషాల నుంచి రాత్రి 23.30 గంటలకు బయలుదేరతాయి.

అలాగే, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఉదయం 6.20 నిమిషాల నుంచి 22.40 గంటలకు ఈ-గరుడ చివరి బస్సు బయలుదేరుతుంది. మరోవైపు, హైటెక్‌ హంగులతో రూపొందించిన ఈ-గరుడ బస్సులను హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ప్రతీ 20 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. రాబోయే రెండేళ్లలో కొత్తగా 1800 ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకు రానుండగా, వాటిలో 1300 బస్సులను హైదరాబాద్‌ నగరంలో మిగతా బస్సులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. హైదరాబాద్‌లో 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సంస్థ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement