Sunday, November 10, 2024

ధ‌ర‌ణి చిక్కుల‌పై ‘న‌వీన్ మార్గ్’

కలెక్టరేట్లలో హెల్ప్‌ డెస్క్‌లు
క్షేత్రస్థాయి టూర్‌కు సీసీఎల్‌ఏ
జిల్లాల వారీగా పెండింగ్‌
దరఖాస్తులపై నవీన్‌మిట్టల్‌ ఆరా
సమస్యల పరిష్కార దిశగా
కసరత్తు షురూ
ఫార్మర్‌ ఫ్రెండ్లీ సర్కార్‌ లక్ష్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ధరణి పోర్టల్‌పై విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ నిర్వహించిన రెవెన్యూ కార్యదర్శి, సీసీఎల్‌ఏ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వెనువెంటనే నూతన కార్యదర్శిగా, ఇన్‌చార్జ్‌ సీసీఎల్‌ఏగా నవీన్‌ మిట్టల్‌ను ప్రభుత్వం నియమించింది. సుదీర్ఘ కాలంగా సీసీఎల్‌ఏ లేకపోవడంతో నెలకొన్న సమస్యలను కొత్త సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌ పరిష్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నిపుణులతో సంప్రదింపులు చేస్తున్న ఆయన అధికారులతో సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆదేశాలతో ధరణి పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదులు, రైతాంగం ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందుల గురించి పరిశీలించారు. ఇందులో ఉన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ఆయన ప్రభుత్వ సూచనలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా త్వరలో ఆయన జిల్లా పర్యటనలు చేయనున్నారని, ఈ క్రమంలో మంచీ చెడులపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారని తెలిసింది.


తాజాగా అధికారులతో సమావేశమైన నవీన్‌ మిట్టల్‌ ఇప్పటివరకు జిల్లాల వారీగా పెండింగ్‌ సమస్యలు, దరఖాస్తుల పరిశీలన, పరిష్కారాల్లో అవలంభిస్తున్న విధానాలు, ఎందుకు జాప్యం జరుగుతోంది… అనే కోణంలో విచారించినట్లు సమాచారం. ఆయా నివేదికలు, వాస్తవాల ఆధారంగా అతి త్వరలో జిల్లాల్లో సదస్సులు నిర్వహించే యోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వానికి కొంత అప్రతిష్ట తెస్తున్న ధరణిపై పూర్తిస్థాయిలో సన్నద్ధానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరలో ఈ సమస్యలకు చరమగీతం పాడాలని, ధరణి పోర్టల్‌ తీసుకొచ్చిన లక్ష్యాల దిశగా విజయవంతం కావాలని ప్రభుత్వం టార్గెట్‌ను నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా సీసీఎల్‌ఏగా నవీన్‌ మిట్టల్‌ను నియమించింది. ఇదే విషయాన్ని మిట్టల్‌కు తెలిపిన సీఎం కేసీఆర్‌ సమస్యల పరిష్కారమే అజెండాగా కీలక సూచనలు చేసినట్లు తెలిసింది.
ఎన్నికల షెడ్యూల్‌లోపే ధరణిలో ఉన్న అన్ని సమస్యలకు ముగింపు పలికి, రైతు ఫ్రెండ్లీగా ధరణిని మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. గతంలో తెరపైకి వచ్చిన రెవెన్యూ సదస్సులతో పాటు ప్రత్యేక బృందాలతో స్వచ్ఛందంగా సమస్యలను నివారించి ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చే కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలోనే జిల్లాల పర్యటనలకు వెళ్లి క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకోవాలని నవీన్‌ మిట్టల్‌ భావిస్తున్నారు.
తాజాగా రైతులకు ధరణి సమస్యలు, అప్లికేషన్ల వ్యవస్థలో అవగాహనకు జిల్లాల్లోని కలెక్టరేట్లలో ధరణి హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. చిన్నచిన్న సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కారమవుతాయని, రైతులు శ్రమకోర్చి వ్యయప్రయాసలకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని భావిస్తున్న అధికారులు ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అనేక రకాల సమస్యలకు ధరణి హెల్ప్‌ డెస్క్‌లతో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. మాడ్యూల్‌ 33లో సర్వే నంబర్‌, ఖాతా నంబర్‌ మిస్సింగ్‌, భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, యజమాని పేర్లు తప్పులు, తండ్రి, భర్త పేర్ల తప్పులు తదితర అనేక సమస్యలకు చెందిన 1.50లక్షల ఫైళ్లు సీసీఎల్‌ఏలో ఉన్నాయి. వీటిని సత్వరం పరిష్కరించే దిశగా ఆదేశాలు జారీ అయ్యాయి.
సర్వం సిద్ధం…
భూ యాజమాన్య హక్కులకు ఆమడ దూరంలో నిల్చిన రైతులకు ఉపశమనం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 40 రకాల సమస్యల పరిష్కారంలో తప్పుల సవరణకు మాడ్యూల్‌ తెరపైకి వచ్చింది. ఇంకా 5లక్షల మంది రైతులు ఇతర కారణాలతో భూ హక్కుల కోసం నిరీక్షిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వారికి పాస్‌ పుస్తకాలు, ప్రభుత్వ సాయం దిశగా కొంత కార్యాచరణ జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పాస్‌ పుస్తకాల్లో తప్పులు, సర్వే నంబర్ల నమోదులో ఇబ్బందులు, ఖాతా నంబర్లు లేని భూములు, నిషేధిత జాబితా, నాలా భూమిగా నమోదు, అసైన్డ్‌, ఇనాం భూముల హక్కులు, సాగులో ఉన్నా సాగేతర భూమిగా నమోదు, మైనర్ల ఫొటోలు పాస్‌ పుస్తకాలపై ముద్రించడం. మ్యుటేషన్‌కు ముందు యజమాని మరణిస్తే సమస్యలు, వారసత్వ బదలీలు, ధరణికి ముందు రద్దయిన రిజిస్ట్రేషన్‌ స్లాట్లకు సర్వే సంఖ్య కాకుండా విస్తర్ణం ఆధారంగా అవకాశం వంటి అనేక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
కుటుంబ అఫిడవిట్‌ను ప్రామాణికంగా ధరణిలో తీసుకుంటున్నారు. వారసత్వ భూములను కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అమ్ముకునే వీలు గతంలో లేదు. ధరణి వచ్చాక ఎవరిపేరు మీద ఉంటే వారు అమ్ముకునే స్వేచ్చ అమలులోకి వచ్చింది. రికార్డుల్లోకి ఎక్కని రైతులకు మార్గం లేకుండా పోయింది. అసైన్డ్‌ చట్టం ప్రకారం అసైనీలు చనిపోతే ఆ భూములను వారసుల పేర్లమీద మార్చాలి. కానీ అది జరగడంలేదు. డిజిటల్‌ సిగ్నేచర్‌ కాని, పాస్‌ పుస్తకాలు జారీ కాని భూములపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలా 11 లక్షల ఎకరాల భూములకు హక్కులు లేవని పాస్‌ పుస్తకాలు నిరాకరించిన హక్కుల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. ఇంకా మరో 3.5లక్షల మందికి పెండింగ్‌ పాస్‌ పుస్తకాల జారీతోపాటు 2.5లక్షల మంది రైతులకు చెందిన రికార్డుల తప్పుల సరిజేత దిశగా యోచిస్తోంది.
గతంలో సబ్‌ కమిటీ చేసిన సిఫార్సులే కీలకం…
ధరణిలో సమస్యల పరిష్కారం దిశగా సబ్‌ కమిటీ కీలక నివేదికను సిద్దం చేసింది. పలు అంశాలతో కూడిన సిఫార్సులను సిద్దం చేసి 34 రకాల సమస్యలకు పరిష్కారమార్గాలుగా కీలక ప్రతిపాదనలు రూపొందించింది. ఈ నేపత్యంలో టీఎం 33 మ్యాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నోటీసుల జారీ పురోగతిలో ఉంది. ప్రధానంగా పేరులో మార్పులు, చేర్పులు, విస్తీర్ణంలో మార్పులు, సర్వే నంబర్‌ తొలగింపు, ఎన్‌వోసీ, ఓఆర్సీ, 38ఈ, 13బి, సర్వే నంబర్‌ను భిన్నమైన ఖాతాలకు మళ్లించడం, అసైన్డ్‌ భూములను పట్టాభూములుగా రికార్డుల మార్పు, ల్యాండ్‌ నేచర్‌, ల్యాండ్‌ టైప్‌ మార్చడం, మిస్సింగ్‌ నంబర్‌, కొత్త సర్వే నంబర్‌ను సృష్టించడం, కొత్త ఖాతా సృష్టి, లావాదేవి నిలుపుదల, ఖాతాల విలీనం వంటి వాటిపై స్పష్టత రావడంతో మెజారిటీ సమస్యలు పరిష్కారమవుతున్నాయి.
ఇంకా కొన్ని…
భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూముల సర్వే నంబర్లలోని మొత్తం పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, కోర్టు కేసులు, ఇతర వివాదాలున్న సర్వే నంబర్లను ఈ జాబితాలో ఉంచడం, వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో కొన్ని సర్వే నంబర్లలోని భూములు నమోదు కాలేదు. ఈ మిస్సింగ్‌ డేటాను సేత్వార్‌, ఖాస్రా పహాణీలో ఉన్న విస్తీర్ణం కంటే తక్కువగా ఉండే వాటి నమోదుకు అవకాశం కల్పించి ఆయా రైతులు రైతుబంధు, రైతు బీమా పథకాలకు అర్హులుగా మార్చాలని ప్రయత్నిస్తోంది.
నాలా మార్పిడితో రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతారని, ఈ భూములను అమ్ముకునేందుకు, బ్యాంకులలో తనఖా పెట్టేందుకు అవకాశం లేకుండాపోయింది. వ్యవసాయేతర భూమిగా నమోదైన వ్యవసాయ భూమిని భూమి వర్గీకరణ మార్పుకు అవకాశం కల్పించి రైతులకు పాస్‌ పుస్తకాల అందజేత వంటి పరిష్కారాలను యోచిస్తున్నారు. గజాలలో ఉన్న భూములకు కూడా మ్యుటేషన్‌ అవకాశం కల్పించాలని, ప్రభుత్వ అసైన్డ్‌ భూముల విషయంలో అమ్మకాలు, కొనుగోలు మినహా మిగతా వ్యవహారాలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదనంగా డిజిటల్‌ సంతకాలు, తప్పుల సవరణలకు అవకాశం కల్పించాలని కూడా సిఫార్సులు చేయనున్నారు. నిషేధిత భూముల జాబితాను సబ్‌ డివిజన్‌ నంబర్ల ఆధారంగా తిరిగి నమోదు చేయాలని, సంబంధంలేని మిగతా భూములను జాబితా నుండి తొలగించనున్నారు. స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీతో క్రయవిక్రయదారులకు అవకాశం ఇచ్చే దిశగా యోచిస్తున్నారు. సర్వే నంబర్‌ విస్తీర్ణంలో మార్పులకు, ఆధార్‌కు బదులుగా సంస్థ పాన్‌ కార్డుతో రిజిస్ట్రేషన్లకు అవకాశం పరిశీలిస్తున్నారు. తిరస్కరించిన మ్యుటేషన్‌ దరఖాస్తులకు మళ్లిd దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అమలులోకి తేనున్నారు. సంస్థ భాగస్వాముల రిజిస్ట్రేషన్‌లో సీఐఎన్‌ బదులుగా పాన్‌ నంబర్‌ను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement