Tuesday, March 28, 2023

‘ఊరికో ఉన్మాది’.. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదన్న దేవినేని

వైసీపీ ప్రభుత్వానికి దిశ, దశ రెండూ లేవని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఆడ బిడ్డలకు రక్షణ కావాలి, జగన్ పాలన పోవాలంటూ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హత్య, అత్యాచార బాధితులకు న్యాయం చేయాలంటూ, ఉన్మాదుల ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తారకరామా నగర్ నుండి జాతీయ హైవేపై ర్యాలీ చేశారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బుధవారం మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ‘ఊరికో ఉన్మాది’ పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి దిశ, దశ రెండూ లేవంటూ హేళన చేశారు. ఉన్మాదులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

టీడీపీ హయాంలో మహిళలపై నేరాల్లో రాష్ట్రం పదో స్థానంలో ఉండేదని, జగన్‌ పాలనలో ఏకంగా మొదటి స్ధానంలోకి వచ్చిందని విమర్శించారు. తన పాలనా తీరుకు ముఖ్యమంత్రి జగన్‌ సిగ్గుతో తల దించుకోవాలన్నారు. జగన్‌ మూడేళ్ల పాలనలో సుమారుగా 800 మంది మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, అకృత్యాలు జరిగాయన్నారు. నిందితుల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో గంజాయి, మత్తుమందు లేని గ్రామం లేదు ఊరికో ఉన్మాది, పేటకో కాలకేయుడు తయారయ్యారని మండిపడ్డారు. దేశంలోని రాజకీయ పార్టీల్లో మహిళలపై నేరాలకు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు వైసీపీలోనే అత్యధికంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వందల సంఘటనలు జరిగితే ఈ మూడేళ్లలో ఒక్కరికైనా ముఖ్యమంత్రి శిక్ష వేయించగలిగారా? మీ కండ కావరం మాపై కాదు..నేరగాళ్లపై చూపించండి అంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement