Friday, April 19, 2024

అపార్ట్​మెంట్ల పేరుతో డిపాజిట్లు–ఐపీఎల్​, బాలీవుడ్​​లో పెట్టుబడులు.. ఇట్లుంటది బడా కంపెనీల యవ్వారం!

బెంగళూరులో అపార్ట్​మెంట్లు నిర్మించి వాటిలో ఫ్లాట్లు అగ్గువకే అందిస్తామని నమ్మబలికి వందలాది మందిని మోసం చేసిన డ్రీమ్జ్​ ఇన్​ఫ్రా ఇండియా లిమిటెడ్​, టీజీఎస్​ కన్​స్ట్రక్షన్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలపై ఈడీ ఫోకస్​ చేసింది. వందలాది మంది నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి సొంతానికి వాడుకోవడమే కాకుండా, ఇతర పెట్టుబడులకు మళ్లించినట్టు ఆధారాలు సేకరించింది. దీంతో బెంగళూరులోని 137 కోట్లకు పైగా విలువైన భూమి, నివాస గృహాలను అటాచ్ చేసినట్టు ఈడీ సోమవారం తెలిపింది. కాగా, ఈ ఆస్తులు డ్రీమ్జ్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ (MD) దిశా చౌదరితోపాటు.. TGS కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని MD మన్‌దీప్ కౌర్, ఇతరుల పేరు మీద ఉన్నాయి.

జూన్ 27న మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద 16 స్థిరాస్తులను జప్తు చేసేందుకు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తెలిపింది. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.137.6 కోట్లుగా పేర్కొంది. గృహ కళ్యాణ్. సచిన్ నాయక్ అలియాస్ యోగేష్ అనే కంపెనీతో సహా నిందితులపై నమోదైన 125 ఎఫ్‌ఐఆర్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఏజెన్సీ నిందితులపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

బెంగళూరు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అపార్ట్ మెంట్‌లు చౌకగా ఇస్తామని వాగ్దానం చేసి, వారి నుండి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారు. ప్రజలను పెద్ద మొత్తంలో మోసం చేశారని ఈడీ తెలిపింది. 2011-12 నుండి 2016-17 వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థలు 10,299 కంటే ఎక్కువ మంది వినియోగదారుల నుండి రూ. 722 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ఆధారాలున్నాయి. ఆ నిధులను వారి సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఫ్లాట్‌లు ఇవ్వకుండా, డిపాజిట్‌ను తిరిగి ఇవ్వకుండా  మోసం చేశారు.

నిందితులు డిపాజిటర్లకు డబ్బును తిరిగి ఇవ్వకుండా… కస్టమర్‌లు అడిగినప్పుడు భయపెట్టారు. ప్రధాన నిందితులు –సచిన్ నాయక్, దిశా చౌదరి, మన్‌దీప్ కౌర్, ఇతరులు – డిపాజిటర్ల డబ్బును వివిధ బ్యాంకు ఖాతాల్లో పెద్దమొత్తంలో డిపాజిట్​ చేశారు. ఆ తర్వాత నగదు రూపంలో విత్‌డ్రా చేసి, ఇతర వ్యాపారాలకు మళ్లించారు అని ED తెలిపింది. అంతేకాకుండా నిందితులు బాలీవుడ్ సినిమాలు తీయడం, ఐపీఎల్ జట్లలో పెట్టుబడులు పెట్టడం, వ్యక్తిగత పార్టీలు, పెళ్లిళ్లు, బహుమతులు, పిల్లల పేరిట మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం వంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ డబ్బునంతా ఖర్చు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement