Thursday, April 25, 2024

డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్… తేలిగ్గా తీసుకోవద్దు!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న వేళ కొత్తగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కలవర పెడుతోంది. ప్రమాదకరంగా భావిస్తున్న ఈ రకం వైరస్‌ కేసులు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వెలుగులో చూశాయి. ప్రస్తుతానికి తక్కువ సంఖ్యలోనే కేసులు ఉన్నా.. దీనిని తేలిగ్గా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటి ఉనికి రెండు నెలల క్రితమే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. డెల్టా ప్లస్‌ రకంలో అధిక వేగంతో విస్తరించడం, ఊపిరితిత్తుల కణాల్లో బలంగా అతుక్కుపోవడం, యాంటీబాడీల స్పందనను  తగ్గించడం వంటి లక్షణాలను గుర్తించారు. ఈ వైరస్ వ్యాప్తి తీరు తెలిసేందుకు మరో మూడు, నాలుగు నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఇచ్చిన డేటా ఆధారంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సేకరించిన 45,000 శాంపిల్స్ లో ‘డెల్టా ప్లస్’ వేరియంట్‌కు చెందిన 48 కరోనావైరస్ కేసులు గుర్తించినట్లు కేంద్రం చెప్పింది. ఇందులో మహారాష్ట్రలో అధికంగా 20 కేసులు గుర్తించారు. తమిళనాడులో తొమ్మిది కేసులు, మధ్యప్రదేశ్ లో ఏడు, కేరళలో మూడు, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండేసి కేసులు, ఏపీ, ఒడిశా, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, కర్నాటకల్లో ఒక్కో కేసు చొప్పున ఈ పరీక్షల్లో గుర్తించారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లోడెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.  ఇప్పటికే చిత్తూరు జిల్లా తిరుపతిలో మొదటి డెల్టా ప్లస్ కేసు వెలుగులోకి వచ్చినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పుడు రెండో కేసు కలవరపెడుతోంది. విజయనగరం జిల్లాలో డెల్టా ప్లస్ వైరస్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన మ్యూటెంట్ల కంటే డెల్టా ప్లస్ ప్రమాదకరం కావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఈ రకం వైరస్‌ వల్ల స్వల్పస్థాయి వ్యాధి లక్షణాలే ఉంటున్నాయని చెప్పారు. కోవిషీల్డ్ , కోవాక్సిన్ టీకాలు  ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి SARS-CoV-2 వేరియంట్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తప్పకుండా మాస్కులు వాడలని సూచిస్తున్నారు.

డెల్టా ప్లస్ వైరస్‌ జన్యుక్రమాల వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ పొరుగు రాష్ట్రాల నుంచి సీసీఎంబీకి నమూనాలు వస్తుంటాయి. వారానికి ఒకసారి వీటి జన్యు పరిణామ క్రమాలను కనుగొంటుంటారు. తిరుపతి నుంచి ఏప్రిల్‌లోనే నమూనాలు రాగా.. అప్పట్లోనే మ్యుటేషన్‌లో వచ్చిన మార్పుల ఆధారంగా కొత్త వేరియంట్‌ను పరిశోధకులు గుర్తించారు. ఇటీవల దీనికి డెల్టా ప్లస్‌ రకమని పేరు పెట్టడంతో.. తాము గుర్తించిన రకం కూడా ఇదేనని జీనోమ్‌ కన్సార్షియం ఇన్సకాగ్‌కు సమాచారం ఇచ్చారు.

ఇదీ చదవండి: 2డీజీ ఔషధాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసిన డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement