Friday, March 29, 2024

లాంగ్ కోవిడ్ వ‌ల్లే ఆక‌స్మిక మ‌ర‌ణాలు…

అమరావతి, ఆంధ్రప్రభ : ఆరోగ్యం గా ఉన్న వాళ్లు కూడా ఆకస్మికంగా కుప్ప కూలి మరణిస్తున్న ఘటలు ఇటీవల తరచూ కనిపిస్తున్నాయి. అలా కుప్ప కూలి మరణించిన వారి వీడియోలు సోషల్‌ మీడియా మాధ్యమాల్లో వైరల్‌ గా మారుతున్నాయి. ఈ మరణాలకు కోవిడ్‌ వ్యాక్సినే కారణమని .. కొన్ని రకా ల మందులు వాడటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ప్రచారం నిజంకాదని వైద్యులు చెబుతున్నారు. ఆకస్మిక మరణాలకు కారణాలను కార్డియాలజీ నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్‌ సమూలంగా పోలేదంటున్న వారు మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, జన సమూహాల్లో ఎక్కువగా తిరగకుండా ఉండటం వంటి వాటిని పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని, దానికి తగినట్లుగా వ్యాయాయం కూడా చేయాలంటున్నారు. అయితే, మితిమీరిన వ్యాయామం కూడా చెరుపేనంటూ హెచ్చరిస్తున్నారు. మన శరీర సౌష్టవం, బరువు, ఆహార్యం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ శ్రమపడకుండా, అలసిపోకుండా స్వల్వ వ్యాయామం చేస్తే సరిపోతుందని అంటున్నారు. కోవిడ్‌ వచ్చాక జాగ్రత్తలు తీసకునేకంటే రాకుండా జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ఆకస్మిక మరణాలనుండి తప్పించుకోవడం సులువని, అది మన చేతుల్లోనే ఉంటుందని వారు సూచిస్తున్నారు.

కోవిడ్‌ తరువాత పెరిగిన గుండె సమస్యలు
కోవిడ్‌ తరువాత ప్రజల్లో గుండె జబ్బులు బాగా పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా లాంగ్‌ కోవిడ్‌ సమస్య (పోస్ట్‌ కోవిడ్‌ కండిషన్‌) ఎదర్కొన్న వారిలో గుండె జబ్బులు రెండు రెట్లు అధికమని పేర్కొంటున్నారు. అలాంటి వారిలోనే కార్డియాక్‌ అరెస్టులు జరుగుతున్నట్లు వారు వెల్లడిస్తున్నారు. ఆకస్మిక మరణాలతోపాటు కొందరు పీఓటీఎస్‌ (పాచ్యురల్‌ టాచీకార్డియా సిండ్రోమ్‌) ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఉన్న పొజిషన్‌ నుండి మారినా, కూర్చుని, పడుకుని లేచినా గుండె దడగా ఉండటం జరుగుతుందని (కూర్చుని, లేచిన తరువాత లేదా పడుకున్న తర్వాత గుండె కొట్టుకునే రేటు చాలా త్వరగా పెరగడం) అని చెబుతున్నారు.

కారణాలివే…
రక్త నాళాల్లో పూడికల వల్ల గుండెపోట్లు వస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. గుండె కండరాలు ఉబ్బడం (మయో కార్డిటైస్‌) వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. గుండె ఆకస్మాత్తుగా ఆగిపోవడం (కార్డియాక్‌ అరెస్ట్‌ – అర్రిటామియా) కూడా కారణంగా చెబుతున్నారు. పల్మనరీ ఎంబోలిజం (గుండె నుండి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) కూడా దీనికి కారణం అవుతుందని వారు అంటున్నారు.

ముందుగా గుర్తించడం కష్టమే
కోవిడ్‌ తర్వాత కొందరిలో హార్మోన్ల సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వారిలో డీ-డైమర్‌ వంటి పరీక్షల చేసినప్పుడు రక్తం చాలా సాధారణంగా ఉన్నా..మరుసటి రోజుకే గడ్డలు ఏర్పడి పల్మనరీ ఎంబోలిజమ్‌తో అకస్మాత్తుగా మరణించే అవకాశాలు కూడా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్డియాక్‌ అరెస్ట్‌, పల్మనరీ ఎంబోలిజంను ముందుగా గుర్తించడం కష్టమేనని పేర్కొంటున్నారు. రక్తంలోనీటి శాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది.

- Advertisement -

అపోహలెన్నో
ఆకస్మిక మరణాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ కారమణి .. ఫలానా వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి గుండె పోటు వస్తుందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ అత్యుత్తమ మార్గమని గుర్తించి అందరికీ వేయడం జరిగిందంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో వేసిన ఎంఆర్‌ఎన్‌ఏ (ప్రైజర్‌, మెడెర్నా) వంటి వ్యాక్సిన్లలో దుష్ఫలితాలను గుర్తించారని, అవి మనదేశంలో వేయలేదని స్పష్టం చేస్తున్నారు.

ముందు జాగ్రత్తలే మేలు
గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని వైద్యలు చెబుతున్నారు. శ్రమతో కూడిన జీవన విధానాన్ని అవలర్చుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. జీవన శైలి మార్చుకోవడం, స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా సరిపడా వ్యాయామం చేయడం, నీరు ఎక్కువగా తీసుకోవడం వంటి వాటి ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement