Saturday, March 25, 2023

Big Story: ‘మరణం నా చివరి చరణం కాదు’.. విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్ యాదిలో..

అతని అక్షరం మండుతున్న అగ్నికణం.. ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం. సామాన్యుని కష్టాలే ఆ కలం కవితా వస్తువులు.. కష్టజీవి కన్నీళ్లే ఆ పెన్నుకు ఇంకు చుక్కలు.. తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఆ ఎర్రమందారమే అలిశెట్టి ప్రభాకర్.. సరళమైన పదాలు.. రక్తం ఉడికించే మాటలతో మర ఫిరంగుల్లాంటి కవితలు రాశారు అలిశెట్టి ప్రభాకర్.

సాహసమనే నిప్పుల మీద కాలాన్ని ఫలంగా వండేందుకు నెత్తుటి ఊటేదో ఊపిరి తీసుకుంటుంది. కష్టాలనే సిరాగా నింపుకునే కలంగా మారి పీడితుడే అణ్వాస్త్రంగా, శత్రువే పాదధూళిగా కన్నీళ్లకు కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. సమానత్వం కోసం దోపిడీ వట వృక్షాన్ని కూల్చేందుకు సైనికులతో కవాతు చేయిస్తుంది.. అక్షరాలతో అగ్గిపుట్టిస్తుంది.. దోపిడిదారుల గుండెల్లో విప్లవ కవిత్వాన్ని బాకులా దింపుతుంది. అందుకే ఆయుధాలుగా రూపాంతరం చెందుతోన్న ఆకలికి అలిశెట్టి ప్రభాకర్ కవిత్వమే నేపథ్యం.

- Advertisement -
   

భారతదేశ విప్లవ చరిత్రకు మరిచిపోని అధ్యాయాన్ని ఇచ్చారు అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాలలో 1954  జనవరి 12 న అక్షర సూరీడు ఉదయించాడు. చినరాజం, లక్ష్మీ దంపతులకు అలిశెట్టి ప్రభాకర్ జన్మించారు.. కరీంనగర్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసిన ప్రభాకర్.. ఇంటర్ కోసం సిద్దిపేటలో ఉన్న అక్కా, బావ ఇంటికెళ్లారు.. అక్కడ మాట పట్టింపులు రావడంతో తిరిగి జగిత్యాలకు వచ్చారు.. అప్పటికే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని మోశాడు..

ఫొటోగ్రఫీపై ఉన్న ఇష్టంతో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు ప్రభాకర్..పెన్సిల్ తో బొమ్మలు గీసే హాబీ, ప్రభాకర్ జీవితానికి సాహిత్యాన్ని పరిచయం చేసింది.. కొంతమంది మిత్రుల సూచనలతో కవితలకు సరిపోయే బొమ్మలు గీసి ఇచ్చిన ప్రభాకర్.. వాటి స్ఫూర్తితో కవిత్వం రాశాడు.. అలా 18 ఏళ్ల వయసులోనే బూర్జువా దోపిడీదారులపై కలాన్ని ఎక్కుపెట్టాడు.1975లో పరిష్కారం పేరుతో అలిశెట్టి రాసిన కవిత తొలిసారి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది.

ప్రభాకర్ గుండె లోతుల్లో అణిచివేయబడ్డ బడబాగ్ని 1978లో జగిత్యాల జైత్రయాత్రతో ఉప్పెనలా బయటకొచ్చింది. పెత్తందారి వ్యవస్థ మీద పేదోళ్లు జరుపుతున్న పోరుతో ప్రభాకర్ లోని అక్షర సూరీడు కొత్త దిక్కున ఉదయించాడు. అందుకే జైత్రయాత్రలో ప్రజల ఉరకలెత్తే ఉత్సాహాన్ని చూసి తనలోని ఆవేశాన్ని ఎర్రపావురాలుగా ఎగరేశాడు. ఆనాటి నుంచి ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. అల్పాక్షరాలతోనే అనల్పార్థాన్ని ఇచ్చే నానీలనే మినీ కవిత్వంతో తెలుగు సాహితీలోకంలో అలజడి సృష్టించాడు. అక్షరాలతోనే సమర శంఖం పూరిస్తున్న ప్రభాకర్ పై ప్రభుత్వాలు, పోలీసులు, భూస్వాములు కక్షకట్టారు. ఫలితంగా నిర్బంధం నీడలా వెంటాడింది.. అందుకే జగిత్యాల నుంచి కరీంనగర్ కు షిఫ్ట్ అయ్యాడు. బతకడం కోసం శిల్పి స్టూడియో ప్రారంభించాడు.1979లో ‘‘మంటల జెండాలు’’ సంకలనాన్ని వెలువరించాడు. అందులో వచ్చిన దోపిడీ చిహ్నం, దశ, పింజర లాంటి ఎన్నో కవితలకు ఇండియన్ ఇంక్‌తో అద్భుతమైన చిత్రాలు గీశాడు.

ఓ వైపు ఫొటోలు తీస్తూనే.. ఇంకోవైపు కవితలు రాశాడు. మరోవైపు బొమ్మలు కూడా గీశాడు. తనలోని భావాలకు చిత్రరూపమిచ్చి వాటితోనే చిత్రకవితలు రాశాడు. ఆ ప్రక్రియ అప్పట్లో పెద్ద సంచలనం. 1981లో ‘చురకలు’ కవితా సంకలనాలను పీడితుల పక్షాన సంధించాడు. వ్యంగ్యం, పదును, విమర్శ, సామాజిక స్పృహ లాంటివన్నీ ఒకేసారి చురకల్లో కనిపిస్తాయి. ప్రజల కోసం, వారి బతుకులు బాగు చేయడానికి వారి బాధలు ప్రపంచానికి తెలియచేయడానికే కవిత్వమని నమ్మిన ప్రభాకర్ అందుకోసం అహర్నిశలు శ్రమించాడు..

982లో భార్య, ఇద్దరు పిల్లలతో కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాడు. ఆయన రాసిన రక్తరేఖ, సంక్షోభ గీతాలు కవితలు సామాన్యులనూ ఆకట్టుకున్నాయి. ప్రభాకర్ దృష్టిలో జీవితం, జీవించడం రెండూ వేర్వేరు. అలా సమాధిలా.. అంగుళం మేరకన్నా కదకుండా పడుకుంటే ఎలా?  కొన్నాళ్లు పోతే.. నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికి నీకే తెలిసి చావదు అంటూ జీవితానికి, జీవించడానికి తేడా చెప్పాడు.

‘‘తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై’’ అంటూ సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాన్ని ప్రపంచానికి చాటాడు ప్రభాకర్. నాలుగు వాక్యాల్లోనే ఆ అభాగ్యుల జీవన వేదనను కళ్లకు కట్టినట్టు ఒక్క అలిశెట్టి తప్ప ఇంకెవరు ఇప్పటికీ చెప్పలేకపోయారు.

అలిశెట్టికి రాజకీయాలన్నా. నాయకులన్నా మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత. అందుకే ‘‘ఓ నక్క ప్రమాణం స్వీకారం చేసిందట. ఇంకెవర్నీ మోసగించనని.. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందంట.. తోటి జంతువుల్ని సంహరించనని.. ఈ కట్టుకథ విని.. గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయ్’’ అంటూ రాజకీయ నాయకుల తీరును కవితలతో ఏకిపారేశాడు.

మరణం నా చివరి చరణం కాదని ప్రకటించిన ప్రభాకర్.. కబళించే మృత్యువును ముందే గుర్తించాడు. తెర వెనక లీలగా మృత్యువు కదలాడినట్టు తెరలు తెరలుగా దగ్గొస్తుంది. తెగిన తీగెలు సవరించడానికన్నట్టు గబగబా పరిగెత్తుకొచ్చి నా భాగ్యం గ్లాసెడు నీళ్లందిస్తుందని పర్సనల్ పోయెం అనే కవితలో రాసుకున్నాడు. చివరి రోజుల్లో పేదరికంతో పోరాటం చేసిన ప్రభాకర్.. పైసల కోసం దారి తప్పలేదు. ఆయన రాసిన కవితల్ని సినిమాలకు అమ్ముకునే అవకాశమచ్చినా ఒప్పుకోలేదు.. సినిమాకవిగా మారి ఉంటే ఎంతో డబ్బు, పేరు సంపాదించేవాడు. కాని, సమాజంకోసమే రాస్తానన్న మాటలకు చివరి శ్వాసవరకుకట్టుబడి ఉన్నాడు. ఫలితంగా అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక 1993 జనవరి 12న హైదరాబాద్ లో చనిపోయాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement