Friday, April 19, 2024

అతిపెద్ద మార్కెట్‌గా ‘డేటా సైన్స్‌’.. గ్రామినర్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ రంగంలో విస్తృతమైన డేటా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ రంగానికున్న ప్రాధాన్యతను మనదేశం ఆలస్యంగా గుర్తించిందన్నారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన ప్రముఖ డేటాసైన్స్‌ కంపెనీ గ్రామినర్‌ నూతన కార్యాలయాన్ని సోమవారంనాడు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దేశంలో డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యమివ్వలేదని విమర్శించారు. ఈ కారణంగా డేటా సైన్స్‌ రంగంలో దేశం వెనకబడిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే ఈ రంగం వేగం పుంజుకుంటోందని వివరించారు. డేటా నిల్వ, అడ్మినిస్ట్రేషన్‌ ప్రస్తుతం అతి పెద్ద మార్కెట్‌గా అవతరిస్తోందని కేటీఆర్‌ అన్నారు. ఈ రంగానికున్న ప్రాధాన్యతను మనదేశం ఆలస్యంగా గుర్తించిందన్నారు. డేటా సైన్స్‌, మానవ వనరుల ప్రోద్బలంతో సమగ్ర కుటుంబ సర్వే వంటి అతిపెద్ద ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజులో పూర్తి చేయగలిగిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. ప్రభుత్వ రంగంలో విస్తృతమైన డేటా ఉందని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.36 కోట్లతో డేటా సెంటర్లను ప్రారంభించామన్నారు.

‘గ్రామినర్‌’తో కలిసి పనిచేస్తాం…
పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, భాగస్వామ్యం కోసం డేటా సైన్స్‌ ఆవశ్యకత ఉందన్న మంత్రి.. ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖల్లోని పలు ప్రాజెక్టుల కోసం గ్రామినర్‌తో కలిసి పనిచేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు డేటా సైన్స్‌ నిర్వ#హణలో వ్యవసాయం, మొబిలిటీ, ఇండస్ట్రీ ఏరియాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గ్రామినర్‌ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం గ్రామినర్‌లో 250 మంది ఉద్యోగులు ఉండగా.. రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు నవీన్‌ గట్టు వెల్లడించారు.

చెరువులను దత్తత తీసుకోండి…
హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని బిల్డర్లందరూ వారికి ఇష్టమైన ప్రాంతాల్లో చెరువులను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. గ్రామినర్‌ కార్యాలయ ప్రారంభ సందర్భంగా అక్కడే ఉన్న బిల్డర్‌లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సభికులను ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, గ్రామినర్‌ కో ఫౌండర్‌ నవీన్‌ గట్టు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement