Saturday, April 20, 2024

మాపై జోకులా?: మంత్రి మల్లారెడ్డిపై దమ్మాయిగూడ ప్రజల ఆగ్రహం

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి మల్లారెడ్డిపై దమ్మాయిగూట ప్రజలు మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మంత్రి జోక్ గా చేసిన కామెంట్లే ఈ వివాదానికి కారణం. హైదరాబాద్ శివారులోని జవహర్‌ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం జరిగిన పాపన్న విగ్రహాన్ని మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే డంపింగ్ యార్డ్ ప్రస్తావన తీసుకొచ్చారు.”డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన జవహర్ నగర్‌కు రావడంలేదెు. దమ్మాయిగూడ వైపు వెళ్లిపోయింది” అంటూ నవ్వుతూ అన్నారు.

మంత్రి వ్యాఖ్యలపై డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా మండిపడుతోంది. మల్లారెడ్డి మాటలు దమ్మాయిగూడ ప్రజలను అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి గారూ.. దమ్మాయి గూడ‌కు వాసన వస్తే మీకు అదృష్టమా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. వాసన జవహర్ నగర్ నుంచి దమ్మాయి గూడ‌కు రాదు, దమ్మాయి గూడ నుంచి జవహర్ నగర్‌కు పోదు.. అది గాలి ఎటువుంటే అటే పోతుందన్నారు. మంత్రి దమ్మాయిగూడ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పడంతో పాటు ఈ డంపింగ్ యార్డ్ మూసివేతకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. దమ్మాయిగూడ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు ఈ పోరాటం ఆగదని స్థానిక నేతలు స్పష్టం చేశారు. ప్రజల కోసం ఒక ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలతో పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి సరదాగా అన్నప్పటికీ ఆ మాటలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారడం ఆయనకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

కాగా, ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి తొడలు కొట్టి మరీ రేవంత్ పై విరుచుకుపడ్డారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement