Thursday, April 18, 2024

తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అమలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం దళిత బంధు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి మాట్లాడారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొనగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దళితుల అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు పథకం సత్ఫలితాలతో దళితులు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారన్నారు.ఈ క్రమంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల‌ని నిర్ణయించారని మంత్రి కొప్పుల‌ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో మొదటిదశలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం అమలు చేస్తామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు సమావేశాలు నిర్వ‌హించి ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి అందించాలని సూచించారు. మార్చి నెల 7వ తేదీలోగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.10 లక్షలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఇందులో నుండి రూ.10వేలు లబ్ధిదారులకు రక్షణ నిధిగా ఉంటుందన్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు, వారికి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లోని అర్హులైన దళిత కుటుంబాలంద‌రికీ దళిత బంధు పథకం అమలవుతుందని తెలిపారు. మార్చి నెల 7వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక చేసుకున్న యూనిట్లను కలెక్టర్లు గ్రౌండింగ్ చేయాలన్నారు. దళిత బంధు పథకం అమలుకు ఈరోజు రూ. 100 కోట్లు విడుదలయ్యాయనీ, మరో రెండు మూడు రోజుల్లో రూ. 12 వందల కోట్లు విడుదల చేసి అన్ని జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దళిత బందు లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారులు, ప్రత్యేక అధికారులకు ముందుగానే స్పష్టమైన సూచనలు ఇవ్వాలని కలెక్టర్లను కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సీఎంఓ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement