Thursday, October 10, 2024

Weather Alert | గోవా, మహారాష్ట్రకు తుపాను హెచ్చరిక.. రుతుపవనాల రాకపై ఎఫెక్ట్​!

అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తుపానుగా మారనుందని, దీంతో గోవా, మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం అల్పపీడనం గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని,  ఇది తూర్పు-మధ్య.. ఆగ్నేయ అరేబియా సముద్రాలపై కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఈ తుపాన్​కు బంగ్లాదేశ్​’బిపార్జోయ్’ గా నామకరణం చేసినట్టు వెల్లడించారు.. అయితే ఈ తుపాను కారణంగా రుతుపవనాల కదలకలో మందగమనం కనిపిస్తోందని, రేపు కానీ, ఎల్లుండికి కానీ కేరళ తీరానికి రుతుపవనాల వచ్చే అవకాశాలున్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది.

ఇక.. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు గోవాకు పశ్చిమ-నైరుతి దిశలో 920 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతి దిశలో 1130 కిలోమీటర్లు, ముంబైకి నైరుతి దిశలో 1050 కిలోమీటర్లు, కరాచీకి దక్షిణంగా 1430 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ తెలిపింది.

తుపాను కారణంగా జూన్ 8వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు కొంకణ్-గోవా-మహారాష్ట్ర తీరాల వెంబడి సముద్ర తీరంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు, చిన్న పడవలు గల వారు, ఇతరుల సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.  ఇదిలా ఉండగా సముద్రంలో ఉన్నవారు తీరానికి తిరిగి రావాలని కూడా సూచించింది.

ఈ అల్పపీడనం తీవ్రతరం కావడం వల్ల కేరళ తీరం వైపు రుతుపవనాల పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన తొలి బులెటిన్‌లో పేర్కొంది. అయితే.. కేరళలో రుతుపవనాలు వచ్చే తేదీని మాత్రం వాతావరణ శాఖ వెల్లడించలేదు. కేరళలో రుతుపవనాలు రేపు (జూన్ 8 లేదా 9 తేదీల్లో) లేదా ఎల్లుండి వరకు  ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ ఫోర్​కాస్టింగ్​ ఏజెన్సీ స్కైమెట్ వెదర్ తెలిపింది.

- Advertisement -

అయితే.. రుతుపవనాల ప్రవేశం కాస్త ఆలస్యం కావచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. అరేబియా సముద్రంలో ఉన్న శక్తివంతమైన వాతావరణ వ్యవస్థల వల్ల కూడా రుతుపవనాల పురోగతికి ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో రుతుపవనాల కదలికలో మందగమనం ఉన్నట్టు, ఆ ప్రభావంతో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement