Thursday, April 25, 2024

డెల్టా ప్లస్ వేరియంట్ పై పనిచేస్తున్న కొవాగ్జిన్

కరోనా కట్టడికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌’ డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తోంది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. దేశంలో కోవిడ్ ఉద్ధృతి, వ్యాక్సిన్ల పనితీరుపై సీఎంఆర్‌ ఓ అధ్యయనం చేపట్టింది. భారత్‌లో కరోనా రెండో దశ వ్యాప్తికి కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్‌ నుంచి కొవాగ్జిన్‌ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోంది… దీంతో పాటు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను కూడా ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్‌ తెలిపింది. ఈ టీకా సమర్ధత 77.8 శాతంగా ఉన్నట్లు  వెల్లడించింది.

దేశంలో గతేడాది అక్టోబరులో డెల్టా వేరియంట్‌ను తొలిసారిగా గుర్తించారు. ఈ వేరియంట్ ప్రస్తుతం డెల్టా ప్లస్‌గా మ్యుటేషన్ చెందినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వేరియంట్ మరింత వేగంగా కరోనాను వ్యాప్తిచేస్తుందని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ కేసులు నమోదయినట్టు పార్లమెంట్‌లో గతవారం సైన్స్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

మరోవైపు కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగం కోసం భారత్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఇరాన్, మెక్సికో సహా 16 దేశాలు ఆమోదం తెలిపాయి. మరో 50 దేశాల్లో ఆమోదం ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. భారత్‌లో ఇప్పటి వరకూ 43 కోట్లకుపైగా డోస్‌ల పంపిణీ జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్‌లో కొనసాగుతోంది. జులై చివరి నాటికి దేశంలో 516 మిలియన్ డోస్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిసెంబరు నాటికి 944 మిలియన్ ల మందికి టీకాలను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగ జాబితాను (EUL) పొందడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో చర్చలు జరుపుతున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. జూలై 9 నాటికి కోవాక్సిన్ కోసం భారత్ బయోటెక్ ద్వారా EUL కి అవసరమైన అన్ని పత్రాలు WHOకి సమర్పించబడ్డాయని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ రాజ్యసభలో గత వారం చెప్పారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో డేంజర్ బెల్స్.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా

Advertisement

తాజా వార్తలు

Advertisement