Saturday, April 20, 2024

నేటి నుండి మేడారం హుండీల లెక్కింపు.. టీటీడీ కళ్యాణ మండపంలో భద్రం

భూపాలపల్లి, ప్రభన్యూస్‌ ప్రతినిధి : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర నాలుగు రోజుల పాటు భక్త జన సందోహం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌, చత్తీస్గడ్‌, ఇతర రాష్ట్రాల్రతో పాటు దేశ నలుమూలల నుండి సుమారు కోటి నలభై లక్షలకు పైగా భక్తులు తరలివచ్చి దేవతలను దర్శించుకుని మొక్కులు, కానుకలు సమర్పించుకున్నారు.భక్తులు కానుకల సమర్పించుకునెందుకు సమ్మక్క , సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజుల గద్దెల ప్రాంగణంలో దేవస్థానం ఆధ్వర్యంలో 497 హుండీలను ఏర్పాటు చేయగా భక్తులు ఆహుండీలలో కానుకల రూపంలో వోడువాల బియ్యంతో పాటు ఆభరణాలు, నగదు సమర్పించుకున్నారు. కాగా సోమవారం రాత్రి ఆలయ ఈఓ టి. రాజేంద్రం ఆధ్వర్యంలో 6 ఆర్టీసీ బస్సులలో 497 హుండీలను హన్మకొండలోని టిటిడి కళ్యాణ మండపంకు తరలించారు.నేడు ( బుధవారం) ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు హుండీల లెక్కింపు ప్రారంభం అవుతుందని అందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మేడారం ఆలయ ఈఓ టి. రాజేంద్రం తెలిపారు.

సుమారు 10 రోజుల పాటు లెక్కింపు
జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను లెక్కించడానికి సుమారు 10 రోజులకు పైగా పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనవేస్తున్నారు. 497 హుండీలతో పాటు తిరుగువారంలో మరో 15 హుండీల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే హుండీల్లో నగదుతో పాటు పసుపు, కుంకుమ , బెల్లం పడే అవకాశం ఉన్నందున లెక్కించడానికి కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అదే విధంగా ఈ సారి జాతరలో ఈ – హుండీలు కూడా ఏర్పాటు చేశారు.

33శాతం వాటా పూజారులకే..
మేడారం మహాజాతరలో భక్తులు వేసే కానుకల్లో 33.33 శాతం ప్రధాన పూజారుల కుటుంబాలకే ఇవ్వాలనే సుప్రింకోర్టు ఆదేశం మేరకు దేవాదాయ శాఖ నడుచుకుంటుంది. ఇప్పటికే ఎండోమెంట్‌ అధికారి ప్రధాన పూజారుల కుటుంబాల బ్యాంక్‌ ఖాతాలు తీసుకున్నారు. లెక్కింపు పూర్తికాగానే వారి వాటాను వారికి జమచేయనున్నారు.గత 2020 మహాజతరకు రూ.11.64 కోట్లు ఆదాయం సమకూరగా ఈ సారి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement