Thursday, March 28, 2024

Coramandol : హెలికాఫ్టర్లలో స్వస్థలాలకు మృతదేహాలు

ఒడిశా బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 300మందికి పైగా దుర్మరణం చెందారు. మరో వెయ్యి మందికి పైగా తీవ్రగాయాలతో ఒడిశాలోని వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే మరణించిన వారి మృతదేహాలు బాలాసోర్ లోని వివిధ ఆస్పత్రుల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వివిధ హాస్పిటల్స్ లో మార్చురీ సౌకర్యాలు లేకపోవడంతో ఆరుబయటే వాటిని ఉంచారు. రైల్వే శాఖ అధికారులు రిజర్వేషన్ చార్టు ఆధారంగా, వారి వద్ద లభ్యమైన వివిధ ఆధారాల ఆధారంగా ఇప్పటి వరకు 194మంది వివరాలను సేకరించారు. వారంతా పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారని అధికారులు తెలిపారు.

గుర్తించిన మృతదేహాలను వారి వారి బంధువులకు అప్పగించేందుకు సైన్యం స్వయంగా రంగంలోకి దిగింది. సైనిక హెలికాఫ్టర్ల ద్వారా మృతదేహాలను ఆయా ప్రాంతాలకు తరలించనున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వాసులైతే వారిని సమీపంలోని పట్టణానికి హెలికాప్టర్ల ద్వారా తరలిస్తారు. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా వారి గ్రామాలకు మృతదేహాలను చేర్చనున్నారు. దీనికి అయ్యే ఖర్చంతా కూడా రైల్వే శాఖ భరించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ప్రమాద స్థలానికి మృతుల, క్షతగాత్రుల బంధువులు వచ్చేందుకు విశాఖ, భువనేశ్వర్, హౌరా, చెన్నైల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. బంధువులు ముందుగా సమాచారం ఇచ్చినట్లైతే ఆయా రైళ్ల ద్వారా బంధువర్గాలను బాలాసోర్ కు తీసుకెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement