Wednesday, May 19, 2021

‘టీఆర్ఎస్ కు ఓటేస్తే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా’: వివాదాస్పద ఫ్లెక్సీ

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగుతున్న వేళ వరంగల్‌ లో ఓ వివాదాస్పద ఫ్లెక్సీ వెలసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా ఐదు మున్సిపాలిటీలకు శుక్రవారం(ఏప్రిల్ 30) పోలింగ్ జరగనుంది. అధికార, విపక్ష పార్టీలు మాత్రం జోరుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మంగళవారం వరకు ప్రధాన పార్టీలు.. తమ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ముమ్మరంగా ప్రచారం చేశాయి. పార్టీ ముఖ్య నాయకులు సహా, అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారంతో ఎన్నికల ప్రచారానికి ముగింపు పడింది. రేపు 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఓ వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ‘‘టీఆర్ఎస్‌ పార్టీకి ఓటేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా.. వీలైతే మీ ఇష్టం-అర్షం స్వామి’’ అంటూ ఉంది. అర్షం స్వామి అనే వ్యక్తి చెప్పు పట్టుకొని ఉన్న ఫోటో కూడా ఈ ఫ్లెక్సీపై ఉంది. వరంగల్‌ లో ప్రధాన కూడలిలో ఈ ఫ్లెక్సీ కట్టడంతో రోడ్డుపై వెళ్తున్న వారు ఆ ఫ్లెక్సీ చూసి ఆశ్చర్యపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అతను ఈ రీతిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Prabha News