Monday, March 25, 2024

సరిహద్దు ప్రాంతాల అభివృద్ధితో న్యూ ఇండియా నిర్మాణం: రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​

సరిహద్దు ప్రాంతాల అభివృద్ధితో స్థానిక ప్రజల్లో భద్రతపై అవగాహన పెరుగుతుందని, మెరుగైన వసతులు కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇవ్వాల (శనివారం) జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా దాని సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని మరియు సరిహద్దు ప్రాంతాల మౌలిక సదుపాయాలను వేగంగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని సరిహద్దు రోడ్ల సంస్థ (BRO)కి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఈ మధ్య కాలంలో ఉత్తర సెక్టార్‌లో చైనా ఉనికి పెరిగిందని, పర్వత ప్రాంతాల నిర్మాణంలో వారి నైపుణ్యం కారణంగా చాలా త్వరగా వివిధ ప్రాంతాలకు చేరుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. వారికి దీటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకుని తమ సామర్థ్యాన్ని పెంపొందించడంపై BRO దృష్టి సారించాలి అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా BROకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని రాజ్నాథ్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో BRO యొక్క మూలధన బడ్జెట్‌ను 40% అంటే.. రూ3,500 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. కేవలం బడ్జెట్ మాత్రమే కాకుండా, ఈ ప్రయత్నంలో సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన BROకి హామీ ఇచ్చారు.

సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని ప్రభుత్వం సమగ్ర రక్షణ వ్యూహంలో ప్రధాన భాగమని రక్షణ మంత్రి అభివర్ణించారు. ఇది దేశ భద్రతా యంత్రాంగాన్ని బలపరుస్తుందని, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు. రక్షణ వ్యూహంలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలక భాగమని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంత శక్తివంతం అవుతారో, ఆ ప్రాంతాల భద్రత గురించి వారు మరింత అవగాహన కలిగి ఉంటారు. పౌరులు దేశం యొక్క గొప్ప శక్తి. కాబట్టి, మారుతున్న కాలానికి అనుగుణంగా, మన సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ముందుకు వెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామని, భద్రత కోసం 24 గంటలూ పనిచేసే వారికి ఆధునిక సౌకర్యాలు కల్పించడం మొదటి ప్రాధాన్యత అని ఆయన అన్నారు.

BRO ప్రాజెక్ట్ ను చేపట్టే ప్రాంతాల్లోనే కాకుండా మొత్తం దేశానికి భద్రత, శ్రేయస్సు కోసం వర్క్ చేస్తున్నందుకు రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. BRO కేవలం నిర్మాణ సంస్థ మాత్రమే కాదని, ఐక్యత, క్రమశిక్షణ, విధి పట్ల అంకితభావం ఉన్న సంస్థ అని ఆయన అభివర్ణించారు. దేశ ప్రగతిలో రోడ్లు, వంతెనలు & సొరంగాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన రక్షణ మంత్రి, BRO ద్వారా పూర్తి చేసిన ప్రాజెక్టులు సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను మెరుగుపరిచాయని, సుదూర ప్రాంతాలలో నివసించే ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచాయని అన్నారు. సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊహించిన విధంగా బలమైన, సురక్షితమైన.. స్వావలంబనతో కూడిన ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి తిరుగులేని నిబద్ధతకు సూచికగా రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

సరిహద్దు ప్రాంతాలు కొత్త అభివృద్ధి కేంద్రాలుగా ఆవిర్భవించాయని, ఈశాన్య ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా దేశ సర్వతోముఖాభివృద్ధికి గేట్‌వేగా మారాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతం భారతదేశాన్ని దక్షిణాసియా, ఆగ్నేయాసియాతో కలుపుతున్నందున, అంతర్జాతీయ స్థాయిలో దేశం యొక్క పురోగతికి ఈ ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. BRO తన 75 కేఫ్‌లు , టూరిజం పోర్టల్ ద్వారా సుదూర ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కూడా ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమాలు నిరంతరంగా పెరుగుతున్న సంస్థ ఎదుగుదలకు ప్రతీక అని ఆయన అన్నారు.

- Advertisement -

అనేక కార్యక్రమాలను ప్రారంభించిన రాజ్నాథ్
భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) అభివృద్ధి చేసిన BRO రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరియు BRO బడ్జెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనే రెండు సాఫ్ట్ వేర్‌లను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. సాఫ్ట్ వేర్‌లు వనరుల పంపిణీ, వినియోగాన్ని అలాగే BRO బడ్జెట్‌ను ఆటోమేట్ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement