Friday, April 19, 2024

రైల్వే లైన్ ధ్వంసానికి దుండగుల కుట్ర.. గ్రామస్థుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

రైల్వేలైన్ ను ధ్వంసం చేసేందుకు దుండగులు భారీ కుట్ర పన్నారు. అయితే గ్రామస్థుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్‌-ఉదయ్‌పూర్‌ రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ట్రాక్‌ చాలా వరకు దెబ్బతింది. ఈ లైన్‌ను గత నెల 31 న ప్రధాని ప్రారంభించారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌పై గన్‌పౌడర్‌ లభించింది. పేలుడు సంఘటన శనివారం అర్థరాత్రి కెవాడే కి నాల్‌లోని రైల్వే బ్రిడ్జిపై సాలుంబర్ మార్గంలో జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో పేలుడు శబ్ధాన్ని విన్న గ్రామస్థులు వెంటనే ట్రాక్‌పైకి చేరుకుని అక్కడి పరిస్థితిని రైల్వే అధికారులకు చేరవేశారు. పేలుడుకు 4 గంటల ముందు ఒక రైలు ఇదే ట్రాక్ గుండా వెళ్లింది. స్థానిక గ్రామస్థుల అప్రమత్తతతో ఈ రైల్వే ట్రాక్‌పై పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పేలుడు అనంతరం అహ్మదాబాద్‌ నుంచి ఉదయ్‌పూర్‌కు వస్తున్న రైలును దుంగార్‌పూర్‌లో నిలిపివేశారు. ఈ మార్గంలో పలుచోట్ల ఇనుప పట్టాలు విరిగిపోయి ఉన్నట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వంతెనపై లైన్‌లో నట్ బోల్ట్‌లు కూడా కనిపించలేదని సిబ్బంది చెప్పారు. ట్రాక్‌పై ఒక సన్నని ఇనుప షీట్ కూడా నలిగిపోయి కనిపించిందని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేది తెలియరాలేదు. ఈ పేలుడు వెనుక పెద్ద కుట్ర దాగి ఉండే అవకాశం ఉన్నదని పోలీసులు విచారణలో అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement